TGSRTC: 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మందిని ఎక్కించారు.. దీంతో ఒక్కసారిగా..

Best Web Hosting Provider In India 2024


సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కిన టీజీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు రెండు చక్రాలు ఊడిపోయాయి. ఈ ఘటన జగిత్యాల సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. నిర్మల్ డిపో బస్.. జగిత్యాల నుంచి వెళుతుండగా మొరపెల్లి వద్ద ప్రమాదం జరిగింది. అయితే.. 50 మంది ఎక్కాల్సిన ఆ బస్సులో 170 మంది ఎక్కారు. ఒవర్ లోడ్ కారణంగా బస్సు వెనకాల రెండు టైర్లు ఊడిపోయాయని తెలుస్తోంది. ప్రమాదం సమయంలో బస్సులో ఎక్కువ మంది మహిళలు పిల్లలే ఉన్నారు.

సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడంతో.. బస్ కండక్టర్, డ్రైవర్ వద్దని వారించారు. కానీ.. ప్రయాణికులు దిగలేదు. దీంతో చేసేదేం లేక అలాగే పోనిచ్చారు. కొద్ది దూరం వెళ్లగానే ఈ ఘటన జరిగింది. అయితే.. ఆ రూట్లో రద్దీకి సరిపడా బస్సులు లేవని.. అందుకే వచ్చిన బస్సులో అందరూ ఎక్కారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సరిపడా బస్సులు ఉంటే.. ఇంత మంది ఒకే బస్సులో ఎందుకు ఎక్కుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిడి..

మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంస్థలో చాలావరకు డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. దీనికి తోడు సంస్థలో భారీగా ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేయడం లేదు. రద్దీని తగ్గించడానికి బస్సుల్ని అదనపు కిలోమీటర్లు తిప్పుతున్నారు. దీంతో డ్రైవర్లు చాలామంది ఒక డ్యూటీ అయిపోగానే కాస్త విరామం తర్వాత రెండో డ్యూటీ చేస్తున్నారు. ఇలా ఒక రోజులో దాదాపు 14 గంటలు విధుల్లో ఉంటున్నామని కొందరు డ్రైవర్లు చెబుతున్నారు. శారీరకంగా, మానసికంగా అలిసిపోతున్నామని.. ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు.

నిబంధనల ప్రకారం 8 గంటలే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రైవర్‌ 8 గంటలు బస్సు నడపాలి. కానీ.. తెలంగాణలో మాత్రం కొన్నిచోట్ల 14 గంటల వరకు బస్సులు నడుపుతున్నారు. ప్రస్తుతం సంస్థలో దాదాపు 600 వరకు డ్రైవర్ల కొరత ఉన్నట్టు సమాచారం. వారు చేసే పనిని కూడా ప్రస్తుతం ఉన్న డ్రైవర్లతో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా ఇప్పుడున్న డ్రైవర్లపై ఒత్తడి పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని.. ఆర్టీసీ యూనియన్ నేతలు కోరుతున్నారు.

టాపిక్

TsrtcFree Bus SchemeTelangana NewsTg Welfare SchemesAccidentsRoad Accident

Source / Credits

Best Web Hosting Provider In India 2024