Best Web Hosting Provider In India 2024
తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంలో పెడుతున్న ఆ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆ స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తొలగించి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎయిర్పోర్టు పేరు మార్చలేదు కదా..
తాము అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు పేరు మార్చలేదన్న కేటీఆర్.. మళ్లీ అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ అని పేరు మారుస్తామని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే ఇష్యూపై ఇటు సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తే.. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఏమాత్రం తగ్గడం లేదు..
ప్రతిపక్ష పార్టీలు ఏ కామెంట్స్ చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే సచివాలయం ముందు కేటాయించిన స్థలంలోకి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఈ నెల 20వ తేదిన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని ఇటీవల మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు.
ఎవరు ఆవిష్కరిస్తారు..
రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్టు సమాచారం. అయితే.. వారు వస్తారా.. రారా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ ముగ్గురు రాకపోతే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం మెప్పు కోసం రేవంత్ రెడ్డి ఈ విగ్రహం ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
టాపిక్