Best Web Hosting Provider In India 2024
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ లీడర్ శ్రీనివాసులు మర్డర్ కేసు మిస్టరీ వీడింది. గతంలో శ్రీనివాసులు ఒకరిని చెప్పుతో కొట్టడమే ఈ హత్యకు దారి తీసిందని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. హోసూరు గ్రామానికి చెందిన నర్సింహులు గతంలో సీఆర్పీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. మూడేళ్ల కిందట ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత గ్రామానికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీలో యాక్టివ్ అయ్యారు. టీడీపీ నేత కేఈ శ్యాంబాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
అప్పటి నుంచి విబేధాలు..
అయితే.. అప్పటికే టీడీపీలో శ్రీనివాసులు క్రియాశీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి సంబంధించి నర్సింహులు, శ్రీనివాసులు మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట వీరిద్దరికీ గొడవ జరిగింది. ఈ సమయంలో.. శ్రీనివాసులు నర్సింహులును చెప్పుతో కొట్టారు. అప్పటి నుంచి శ్రీనివాసులుపై నర్సింహులు పగ పెంచుకున్నారు. ఇటీవల టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. శ్రీనివాసులుకు పత్తికొండ పీఏసీఎస్ ఛైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది.
ఆ విషయాన్ని జీర్ణించుకోలేక..
శ్రీనివాసులు పీఏసీఎస్ ఛైర్మన్ పదవి ఇస్తారన్న విషయాన్ని నర్సింహులు జీర్ణించుకోలేకపోయాడు. శ్రీనివాసులు మర్డర్‌కు ప్లాన్ చేశాడు. ఇందుకు అతని ఫ్రెండ్ వి.నర్సింహులు సపోర్ట్ చేశాడు. మర్డర్ చేయడానికి అదే గ్రామానికే చెందిన నలుగురి సహకారం తీసుకున్నాడు. ఈనెల 14న ఉదయం శ్రీనివాసులు బహిర్భూమికి వచ్చినప్పుడు.. రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగంగా చేశారు. విచారణలో అసలు బయటపడింది. ఈ కేసులో మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
వైసీపీ కౌంటర్ ఎటాక్..
అయితే.. శ్రీనివాసులును వైసీపీ నాయకులే హత్య చేశారని టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు అసలు విషయం తెలియడంతో.. వైసీపీ కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. మంత్రి పదవుల్లో ఉండి నారా లోకేష్, అనిత అబద్ధాలు చెప్పారని విమర్శలు చేసింది. తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
టాపిక్