Best Web Hosting Provider In India 2024
AP Govt Jr Colleges Jobs : ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 957 అతిథి అధ్యాపకులు (గెస్టు లెక్చరర్స్) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆయా కాలేజీల్లోనే ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉత్తర్వుల్లో నియామకం అయిన గెస్ట్ లెక్చరర్ పది నెలల పాటు విధులను పరిగణిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 801 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం 957 గెస్టు లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తారు.
గెస్టు లెక్చరర్స్‌కు గౌరవ వేతనం ఉంటుంది. ఒక పిరీయడ్ (ఒక గంట)కు రూ.150 ఉంటుంది. నెలకు గరిష్టంగా రూ.10 వేలు ఉంటుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలుపుతూ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ రకంగానే గెస్టు లెక్చరర్స్ నియామం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తి చేసిన అభ్యర్థులు గెస్టు లెక్చరర్స్ గా నియమిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి కాలేజీల వారీగా నియామకం చేపడతారు. కళాశాలల్లో ఖాళీలు భర్తీకి ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ పత్రికా ప్రకటన ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్వ్యూలు నిర్వహించిన తరువాత, డెమో నిర్వహిస్తారు.
అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ, డెమో ఆధారంగానే నియామకాలు చేపడతారు. ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూకు బయోడేటా, సర్టిఫికేట్లతో హాజరుకావల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. పీజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ సెట్, నెట్, పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
అయితే మరోవైపు గతంలో ఉన్న గెస్టు లెక్చరర్స్‌నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గెస్ట్ లెక్చరర్స్ గౌరవ వేతనం ఒక పీరియడ్ (ఒక గంట)కు రూ.150 నుంచి రూ.375 పెంచాలని డిమాండ్ కూడా ఉంది. అలాగే నెలకు గరిష్టంగా రూ.10 వేలు నుంచి రూ.27 వేలకు పెంచాలని కోరుతున్నారు. ఇప్పటికే జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్‌కు ఇచ్చే నెల వారీ వేతనం రూ.27 వేలు, గెస్టు లెక్చరర్స్‌కు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కడప ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో గెస్టు లెక్చరర్స్ పోస్టులు భర్తీ
కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జువాలజీ విభాగంలో అతిథి అధ్యాపకుల (గెస్టు లెక్చరర్స్) పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగస్టు 19న ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ వీ.సలీంబాషా తెలిపారు. జువాలజీ సబ్జెట్ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించాల్సి ఉంటుంది. ఎంఎస్సీ జువాలజీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ సెట్, నెట్, పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 19 ఉదయం 11 గంటలకు కాలేజీలోని ఇంటర్వ్యూకు బయోడేటా, సర్టిఫికేట్లతో హాజరు కాగలరు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్