TG DSC Results 2024 : డీఎస్సీ ‘కీ’పై భారీగా అభ్యంతరాలు..! త్వరలోనే తుది ఫలితాలు

Best Web Hosting Provider In India 2024


త్వరలోనే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్షలు పూర్తి అయిన కొద్దిరోజుల్లోనే ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై అభ్యంతరాలను స్వీకరించే గడువు కూడా ఆగస్టు 20వ తేదీతో పూర్తి అయింది. 

అయితే డీఎస్సీ పరీక్షల ప్రాథమిక ‘కీ’పై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యర్థుల నుంచి 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. ఆన్ లైన్ ద్వారా స్వీకరించిన ఈ అభ్యంతరాలను పరిశీలించే పనిలో విద్యాశాఖ ఉంది. ఈ ప్రక్రియను అంతా కూడా త్వరితగతిన పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా… ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి.  ఇందులో కొన్ని ప్రశ్నలకు సంబంధించే ఎక్కువ అభ్యంతరాలు వచ్చినట్లు తెలిసింది.

త్వరలోనే ఫలితాలు…!

డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన  ఫైనల్ ‘కీ’ లను ఈనెలాఖారులోనే ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే తుది ఫలితాలను కూడా విద్యాశాఖ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.  సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది. ఫైనల్ కీ తర్వాత జనరల్ ర్యాకింగ్ లిస్ట్ అందుబాటులోకి రానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత… నియామక పత్రాలను అందజేయనుంది. 

నిజానికి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. గ్రూప్స్ పరీక్షలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ… డీఎస్సీ పరీక్షలను యథావిథిగా నిర్వహించింది. నిర్ణయించిన షెడ్యూల్ లోపే పరీక్షలను పూర్తి చేసి… కొత్త టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది.

డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 18 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోస్టుల వారీగా చూస్తే…. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. 

డీఎస్సీ పరీక్షల్లో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు మరో రోజు రావడంపై కూడా విద్యాశాఖ దృష్టిపెట్టింది. పలు ప్రశ్నలు పునరావృతం కావటానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. అయితే అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధింత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక సెషన్‌లో ఒక జిల్లా వారికి మాత్రమే పరీక్ష నిర్వహించామని… ఇది అభ్యర్థుల ర్యాంకులను ప్రభావితం చేయదని చెప్పుకొస్తున్నారు. పుకార్లను నమ్మవద్దని కోరుతున్నారు. డీఎస్సీ రిక్రూట్ మెంట్ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగా జరుగుతుందని చెబుతున్నారు.

 

టాపిక్

Ts Dsc JobsTelangana NewsRecruitment

Source / Credits

Best Web Hosting Provider In India 2024