Best Web Hosting Provider In India 2024
ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ది ప్రత్యేకమైన స్థానం. వయసు, లింగ భేదంతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు జీన్స్ వేసుకోవడాన్ని బాగా ఇష్టపడతారు. ప్రపంచ దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన జీన్స్‌పై ఒక్క దేశంలో మాత్రం చాలా కాలంగా నిషేధం ఉంది. ఆ దేశం ఉత్తర కొరియా.
స్ట్రిక్ట్ రూల్స్‌కి కేరాఫ్
ఉత్తర కొరియా అనగానే మనందరికీ గుర్తొచ్చేది కఠినమైన చట్టాలు. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తరచూ విచిత్రమైన చట్టాలను తెరపైకి తెస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఉత్తర కొరియా ప్రజలు ప్రాశ్చాత్య దేశాల భావాజాలానికి ఎక్కడ ఆకర్షితులు అవుతారనే కారణంతోనే అతను కఠిన చట్టాలు తెస్తుంటాడు.
జీన్స్ వేసుకుంటే ఇక అంతే!
ఉత్తర కొరియా ప్రజలు ఎవరైనా జీన్స్ వేసుకుని బయటికి వస్తే వారికి రోడ్డుపైనే కిమ్ ప్రభుత్వం కఠినమైన శిక్షలు వేస్తుంటుంది. అక్కడే ఆ జీన్స్‌ని మళ్లీ వేసుకోవడానికి వీలులేని విధంగా నాశనం చేయడమే కాదు జైలు శిక్ష లేదా జరిమానాను విధిస్తారు. ఒక్కోసారి రెండు శిక్షలూ వేస్తుంటారు. ఉత్తర కొరియాలో కఠినమైన డ్రెస్ కోడ్‌ను అమలు చేయడానికి ప్రత్యేకంగా వీధుల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటారు. జీన్స్ వేసుకుని దొరికిన వాళ్లని శిక్షించడంతో పాటు ఉత్తర కొరియా డ్రెస్ కోడ్‌పై ప్రజలకి అవగాహన కల్పించడం కూడా ఆ పోలీసుల విధి.
జీన్స్‌పై నిషేధం ఎందుకంటే?
వాస్తవానికి జీన్స్‌పై ఉత్తర కొరియాలో నిషేధం చాలా మందికి హాస్యాస్పదంగా అనిపించొచ్చు. కానీ అంతర్లీనంగా ఆ నిషేధం వెనుక పెద్ద కారణం దాగి ఉంది. ప్రాశ్చాత్య సంస్కృతిలో భాగమైన జీన్స్ ధరించడం అంటే.. ఉత్తర కొరియాలోని కమ్యూనిజానికి వ్యతిరేకంగా తమకి స్వేచ్ఛ కావాలంటూ తిరుగుబాటు చేస్తున్నట్లు పరిగణిస్తారు. అందుకే పాశ్చాత్య సంస్కృతి వైపు ఆ దేశ ప్రజలు అడుగు వేయడాన్ని ఆ దేశ అధినాయకత్వం ఏమాత్రం సహించదు.
కిమ్ నిషేధించిన లిస్ట్ చూస్తే..
ఉత్తర కొరియా ప్రజలపై తరచూ ఆంక్షలు పెట్టే కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికే చాలా వాటిపై ఆ దేశంలో నిషేధం విధించాడు. వయసుతో సంబంధం లేకుండా ప్రభుత్వ నిర్దేశించిన ప్రమాణాలకి అనుగుణంగా అందరూ జుట్టును కత్తిరించుకోవాలి. మరీ ముఖ్యంగా కిమ్ తరహాలో ఎవరూ జుట్టుని కత్తిరించుకోకూడదు. ఒకవేళ కత్తిరించుకుంటే నడిరోడ్డుపై వారికి జుట్టుని కత్తిరించి శిక్షలను అమలు చేస్తారు.
మహిళలు, పురుషులు ఎవరూ జీన్స్‌ను ధరించకూడదు, నీలిరంగు ఆభరాణాల్ని అస్సలు వేసుకోకూడదు. మహిళలు రెడ్ లిప్‌స్టిక్ వేసుకోకూడదు. ఆఖరికి బ్లాక్ కలర్ ట్రెంచ్ కోటు కూడా దేశంలో ఎవరూ వేసుకోకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఆ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు విధిస్తారు.