Best Web Hosting Provider In India 2024
కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. తప్పతాగి ప్రసాదాలు తయారు చేసే అయ్యగారు పడుకోవడంతో స్వామి వారికి నివేదన ఆలస్యమయ్యింది. క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు ఆలయ ఉద్యోగుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజు ఏసీబీ రైడ్స్ కొనసాగాయి. ఓ వైపు ఆలయంలో ఏసిబి అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా మరో వైపు ఆలయ అధికారుల, పూజారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసిబి తోపాటు తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
మొదటిరోజు గోదాంలో ముడిసరుకుల లెక్కలు, ప్రసాదాల తయారీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. తూకం వేసి తనిఖీ చేశారు. రెండో రోజు టెండర్ల రికార్డులను పరిశీలించారు. ఆ సమయంలోనే వంట చేసే బ్రాహ్మణుడు సంతోష్ తప్పతాగి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఉదయం 11.30 నిమిషాలకు స్వామి వారికి నివేదన ఉంటుంది. అయ్యగారు తాగి పడుకుని ఆలస్యంగా మెల్కొనడంతో నైవేద్య ప్రసాదం తయారు చేయడం ఆలస్యమయ్యింది.
హడావిడిగా ఉడికి ఉడకని నైవేద్యం…
ఆలస్యంగా మేల్కొన్న అయ్యగారు ఆగమేఘాల మీద స్వామివారికి నైవేద్య ప్రసాదం తయారు చేశారు. దీంతో సగం ఉడికి ఉడకని నైవేద్యాన్ని వేడివేడిగా తీసుకెళ్ళి నివేదన పూర్తి చేశారు. అప్పటికే క్యూ లైన్ లో భక్తులు దర్శనానికి బారులు తీరి ఉన్నారు. నివేదన కోసం దర్శనాలను నిలిపివేయడంతో భక్తులు అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యగారి నిర్వాకంతో స్వామివారికి సకాలంలో నివేదన చేయకుండా భక్తులను క్యూ లైన్ లో నిల్చోబెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆందోళనకు దిగారు.
తాగుబోతు అయ్యగారే దిక్కు…
రాజన్న ఆలయంలో స్వామివారికి నైవేద్య ప్రసాదాల తయారీకి ముగ్గురు బ్రాహ్మణ ఉద్యోగులు ఉన్నారు. అందులో ఒకరు అనారోగ్యంతో సిక్ లీవ్ లో ఉండగా మరొకరు విధులకు ఎగనాం పెట్టారు. ఇక తాగుబోతు బ్రాహ్మణుడు మాత్రమే నైవేద్య ప్రసాదాల తయారీకి దిక్కయ్యాడు.
మద్యం మత్తులో నైవేద్య ప్రసాదం తయారు చేయడంలో ఆలస్యం చేయడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు అవినీతి ఆరోపణలపై ఆలయంలో ఏసీబీతో పాటు తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగానే అయ్యగారు తప్ప తాగి విధినిర్వహణ మరిచిపోవడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అయ్యగారు నిర్లక్ష్యంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని స్థానికులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్