Best Web Hosting Provider In India 2024
Bhagavad Gita: హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో భగవద్గీత ఒకటి. శ్రీ కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం, జీవిత పాఠాలు భగవద్గీతలో దాగి ఉన్నాయి. 5000 సంవత్సరాలకు ముందే ఈ భగవద్గీత ఉనికిలో ఉందని చెప్పుకుంటారు. చావు పుట్టుకల దగ్గర నుంచి యుద్ధం వరకూ ప్రతిదీ భగవద్గీతలో ఇమిడి ఉంది.
భగవద్గీత మొదలయ్యేదే అర్జునుడు తన ఆయుధాలు అన్ని వదిలేసి యుద్ధరంగం నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటాడు. యుద్ధంలో తన వారు మరణించడం చూసి తట్టుకోలేక పోతాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత రూపంలో జీవిత పాఠాలను నేర్పుతూ ఉత్తేజపరుస్తాడు. రాజుగా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాడు.
చివరికి అర్జునుడు మళ్ళీ ఆయుధాన్ని పట్టి యుద్ధ రంగంలో శత్రువుల ఏరివేతను మొదలు పెడతాడు. భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే కాదు, ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషికి ఎన్నో జీవిత పాఠాలను నేర్పేదిలా ఉంటుంది. భగవద్గీత నుంచి ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
ఇది భగవద్గీతలోని ప్రసిద్ధ వాక్యం. ప్రతి మనిషి జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన విషయం. దీనికి అర్థం మీరు మీ విధులను నిర్వర్తించండి, కానీ ఆ పనుల ఫలితాన్ని గురించి ఆలోచించకండి అని అర్థం. అంటే మీరు పని పూర్తి చేయడం పైన, ఆ పనిని సమర్థంగా నిర్వర్తించడం పైన మాత్రమే దృష్టి పెట్టాలి. ఆ పని ఫలితం ఎలా ఉంటుందోనని ముందు నుంచి ఆలోచించడం మానేయాలని అర్థం. మీరు జీవితంలో అలానే ఉండాలి. ఫలితం గురించి ఆలోచిస్తే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయలేరు.
నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ॥
ఈ శ్లోకానికి అర్థం… ఆత్మ చాలా బలమైనది. దాన్ని ఏ ఆయుధంతోనూ ముక్కలు చేయలేము, అగ్నితో కాల్చలేము, గాలి, నీటితో కూడా ఆత్మను నాశనం చేయలేము అని అర్థం. అంటే మనలోని ఆత్మ ఎంతో బలమైనది, శక్తివంతమైనదని భగవద్గీత చెబుతోంది. ఆత్మ బాహ్యంగా కనిపించకపోవచ్చు, కానీ అది చాలా బలంగా ఉంటుంది. ఆత్మ అనేది మీ అంతర్గత శక్తి. అంటే మనసు, మెదడే. ఆ రెండింటినీ బలంగా ఉంచుకుంటే మీరు ఏదైనా సాధించగలరు.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన: |
కం: క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్ ||
భగవద్గీతలోని ఈ శ్లోకం ఒక మనిషి స్వీయ నాశనానికి కారణమయ్యే అంశాలను వివరిస్తోంది. ఒక మనిషికి కామం, కోపం, దురాశ… ఈ మూడు అధికంగా ఉంటే వారు వాటిని వెంటనే వదిలించుకోవాలి. లేకుంటే వారి పతనాన్ని వారే కొని తెచ్చుకున్నట్టు అని ఈ శ్లోకం చెబుతోంది. కామం, కోపం, దురాశ అనేవి తప్పుడు మార్గాలు. ఇవి బలమైన, తెలివైన మనుషులను కూడా నాశనం చేస్తాయి. మీ జీవితాలను ప్రమాదంలోకి ఓటమి అంచులకు తీసుకువెళతాయి. కాబట్టి ఆ మూడింటి విషయంలో మీరు మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుంటే చాలు.
దు:ఖేశ్వనుద్విగ్నమనా: సుఖేషు విగతస్పృహ: |
వీతరాగభయక్రోధ: స్థితధీర్మునిరుచ్యతే ||
భగవద్గీతలోని ఈ శ్లోకం.. దుఃఖానికి కలవరం చెందని వ్యక్తి, సుఖం కోసం పాకులాడని వ్యక్తి, అనుబంధాలు, భయం, కోపం వంటివి అధికంగా చూపించని వ్యక్తి… జ్ఞానితో సమానం అని చెబుతోంది. ఒక మనిషి భయం, కోపం వంటి వాటిలో చిక్కుకుంటే ఏదీ సాధించలేడు. ప్రాపంచిక అనుబంధాల్లో చిక్కుకుపోతే అతను తను అనుకున్నది సాధించడం కష్టమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాగద్వేషాలకు పోకుండా జ్ఞానిలా, రుషిలా ఉండాలని తెలుసుకోండి.
టాపిక్