Telangana Congress : బీసీ నేతకే పీసీసీ పీఠం…! రేసులో ఆ ఇద్దరు నేతలు..? కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ

Best Web Hosting Provider In India 2024


తెలంగాణ పీసీసీ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. చాలా రోజులుగా ఈ స్థానాన్ని భర్తీ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ…ఖరారు కాలేదు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… పార్టీలోని కీలక నేతలతో చర్చలు జరిపారు. పీసీసీ పదవితో పాటు కేబినెట్ విస్తరణ, రుణమాఫీ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై పార్టీ అధినాయకత్వం లోతుగా కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రుల అభిప్రాయాలను కూడా అధినాయకత్వం సేకరించింది. అయితే ఈసారి బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకే ఈ పదవిని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రేసులో ఆ ఇద్దరు నేతలు…!

పీసీసీ అధ్యక్ష పదవి కోసం బీసీ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పీసీసీ ఛైర్ పై ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే… ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవకాశం దక్కేది. కానీ ఓడిపోవటంతో పార్టీలో కీలక పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పీసీసీ పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

ఈ పదవి కోసం ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఎస్సీ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్, సంపత్ కుమార్ పేర్లు కూడా ప్రతిపాదనకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈసారి బీసీ నేతకే పీసీసీ కట్టబెట్టేందుకు అధినాయకత్వం మొగ్గుచూపుతున్నట్లు లీకులు వస్తున్నాయి. మరోవైపు కేబినెట్ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉంది. సామాజికకూర్పును దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ పదవులను భర్తీ చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.

కేబినెట్ లో చోటు ఎవరికి..?

మరోవైపు మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. ఆయా జిల్లాల్లో కూడా సమీకరణాలు మారిపోతున్నాయి. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు ఉండగా… ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అయితే విస్తరణలో కూడా సామాజిక సమీకరణాలు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ఎవరూ లేరు. ఈ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఇక కేబినెట్ లో చోటు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా బీర్ల ఐలయ్య పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి. వివేక్, ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో చూస్తే ప్రేమ్ సాగర్ రావు పేరు ఖరారు కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు కావటంతో…. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తం ఆరు ఖాళీలు ఉండగా… ప్రస్తుతం జరిగే విస్తరణలో నాలుగు బెర్తులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మరో రెండు పెండింగ్ లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా పీసీసీ చీఫ్ ను ఖరారు చేసి.. ఆ తర్వాత విస్తరణకు ముహుర్తం ఖరారు చేసే అవకాశం ఉంది..!

టాపిక్

Cm Revanth ReddyTelangana NewsCongressTelangana CongressTs Cabinet

Source / Credits

Best Web Hosting Provider In India 2024