Best Web Hosting Provider In India 2024
కాస్త కొత్తగా మార్పు చేర్పులు చేస్తే అదే ట్రెండీ ఫ్యాషన్ అయి కూర్చుంటుంది. సెలెబ్రిటీలు అలా చిన్న మార్పులు చేసినా సరే అందరికీ పెద్ద విషయమే. వాళ్లు వేసుకునే నగలు, ఫ్యాషన్ ఫాలో అయిపోతారంతా. ఈ మధ్య కనిపిస్తున్న మరో ఫ్యాషన్ మల్టీపుల్ జ్యువెలరీ ట్రెండ్. కంగనా రనౌత్, రాధిక మర్చంట్, అదితి రావ్ హైదరీతో పాటూ.. కొద్దిమంది సెలెబ్రిటీలు ఇలా మల్టీపుల్ జ్యువెలరీలో కనిపించారు. దాన్ని మనకు తగ్గట్లు ఎలా మార్చుకోవచ్చో కూడా చూడండి.
మల్టీపుల్ జ్యువెలరీ ఏంటీ?
మెడకు అతుక్కునే చోకర్, కాస్త కిందికి మధ్యలో మిడిల్ లెంగ్త్ హారం, దాని కింది ఫుల్ లెంగ్త్ హారం.. ఈ ట్రెండ్ కొన్నేళ్లుగా నడుస్తోంది. మూడు వరసల్లో ఉండే హారాలు ఇలాగే వేసుకుంటున్నారు. కానీ మల్టీపుల్ జ్యువెలరీ ట్రెండ్ గమనిస్తే పైన కింద హారానికి మధ్య ఎడం ఉండదు. రెండు చోకర్లు, రెండు హారాలు, రెండు నగలు ఒకే పొడవున్నవి వేసుకుంటారు. ఒకే చోట ఎడం లేకుండా ఉండటంతో చాలా హెవీ లుక్ వీటివల్ల వస్తుంది.
సెలెబ్రిటీలు
ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్ కోసం కంగనా వేసుకున్న మల్టీపుల్ చోకర్ లుక్ అందరినీ ఆకర్షించింది. కొత్తగా, హుందాగా మెరిసిపోయింది కంగనా. ఈ లుక్ కోసం రెండు చోకర్లను వేసుకుందామె. ఒక చోకర్ ముత్యాల వరసలతో, మధ్యలో యాంటిక్ లుక్ పనితనంతో ఉంది. మరో చోకర్ ఆకుపచ్చ పూసల వరసలతో మధ్యలో ఐ డ్రాప్ ఆకారం పెండెంట్ల వరసతో ఉంది. ఈ రెండింటినీ కలిపి వేసుకుని కంగనా కొత్త లుక్ క్రియేట్ చేశారు.
ఇలాంటి లుక్ రాధిక మర్చంట్ ప్రి వెడ్డింగ్ వేడుకల్లోనూ గర్భానైట్ కోసం ఇలాగే పచ్చలు పొదిగిన మల్టీపుల్ జ్యువెలరీ వేసుకుని కనిపించారు. అదితిరావ్ హైదరీ కూడా ఈ మధ్య ఒక నగల ప్రమోషన్ కోసం ఈ రకం లుక్ లోనే కనిపించారు.
మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు?
పదేళ్ల క్రితం వచ్చిన బాలీవుడ్ సినిమా 2 స్టేట్స్ లో ఆలియా భట్ కాస్త ఇదే తరహా నగల డిజైనింగ్‌లో మెరిసింది. అది మనలో ఎవరైనా సెట్ చేసుకునే ఫ్యాషన్ లాగా ఉంది. రెండు నెక్ లెంగ్త్ కాసుల హారాలను కలిపి వేసుకున్న లుక్ ఆలియాకు భలే సెట్ అయ్యింది. ఇప్పుడు మనమూ ఈ ట్రెండ్ ఫాలో అయిపోవచ్చు.
అంటే ఉదాహరణకు మీరు కట్టుకున్న చీరంతా ఎరుపు రంగు, చీర అంచు ఆకుపచ్చ రంగులో ఉందనుకోండి. మెడలో ఒక ఎరుపు రంగు పూసల చోకర్, ఆకుపచ్చ చోకర్ కలిపి వేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించండి. లుక్ కొత్తగా ఉంటుంది. కంగనా రనౌత్ లుక్ వస్తుంది.
లేదంటే మీద పచ్చల చోకర్ వేసుకుని దాని కింద కాసులు, మామిడి పిందెలు, బొట్ల లాకెట్లు ఒదిగిన చోకర్ వేసుకున్నారంటే చక్కగా కనిపిస్తారు. ఇది కాస్త ఆలిబా భట్ లుక్ పోలి ఉంటుంది. అలాగే కాసులు ఉన్న చోకర్లు రెండు పెట్టుకుంటే ఆలియాభట్ లుక్ వస్తుంది. రాధిక మర్చంట్ లుక్ కాస్త హెవీ వేడుకలకు సెట్ అవుతుంది. మీ ఇష్టాన్ని బట్టి ఈ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ఒక్కసారైనా ప్రయత్నించి చూడండి.