Best Web Hosting Provider In India 2024
నాగార్జున ఎన్- కన్వెన్షన్ నిర్మాణంపై హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను ఇవాళ ఉదయం కూల్చివేయించారు. మాదాపూర్ లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందటంతో ఈ చర్యలు తీసుకున్నారు. మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఈ నిర్మాణం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఎన్-కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో నిర్మించబడి ఉంది.
సినీ హీరో అఖినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. మొత్తం మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు అందాయి. గతంలోనే ఈ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారనే వార్తలు వచ్చినప్పటికీ జరగలేదు. అయితే ఇటీవలే రాష్ట్ర కేబినెట్ లోని మంత్రి… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేయటంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు..!
ఎన్ – కన్వెన్షన్ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగస్టు 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా హైడ్రా కమిషనర్ రంగానాథ్ కు కూడా ఓ లేఖను రాశారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్‌టీఎల్ లో ఎన్- కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపారు. శాటిలైట్ ఫోటోలతో సహా పలు ఆధారాలను తన ఫిర్యాదుకు జత చేశారు.
మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా అధికారులు… నేరుగా రంగంలోకి దిగారు. శనివారం ఉదయమే ఎన్ – కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకుని కూల్చివేత పనులను ప్రారంభించారు. యంత్రాల సాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. పరిసర ప్రాంతాల్లోనూ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్ లోకి వెళ్లే దారులను కూడా మూసివేశారు. లోపలికి కూడా ఎవర్నీ అనుమతించలేదు. ఎంత వరకైతే ఆక్రమణ జరిగిందో అక్కడి వరకు ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు.
మొత్తం 10 ఎకరాల్లో ఎన్-కన్వెన్షన్ నిర్మాణం ఉండగా అందులో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని అధికారులు చెబుతున్నారు. మరో 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉందంటున్నారు. చెరువు ఆక్రమణ జరిగిన నేపథ్యంలోనే కూల్చివేశామని అంటున్నారు. ఇక మాదాపూర్ లో ఉన్న ఎన్-కన్వెన్షన్‌లో హీరో అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతంరెడ్డి భాగస్వామ్యులుగా ఉన్నారు.
టాపిక్