Nagarjuna Reaction: ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. చెరువు భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఈ కూల్చివేతపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తామే కూల్చివేసేవాళ్లమని నాగార్జున వ్యాఖ్యానించారు.

‘స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం.. కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం.. చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపడం కోసం ఈ ప్రకటన విడుదల చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు ఇచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే.. కూల్చివేత తప్పుడు సమాచారంతో, చట్ట విరుద్ధంగా జరిగింది’ అని నాగార్జున ప్రకటన విడుదల చేశారు.

‘ఈ రోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే.. కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని.. తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అని నాగార్జున్న పేర్కొన్నారు.

వ్యవస్థాపక పార్ట్‌నర్‌గా నాగార్జున..

ఎన్ 3 రియాల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ కింద ఎన్ కన్వెన్షన్ నడుస్తోంది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవస్థాపక పార్ట్‌నర్. దీన్నీ పిల్లర్లు లేకుండా హైసీలింగ్‌లో నిర్మించారు. 2 నుంచి 3 వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్ ఉంటుంది. 350 నుంచి 450 మంది కూర్చునేలా డైమండ్ హాల్ నిర్మించారు. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనయన్ హాల్ నిర్మించారు. 2015 ఆగస్ట్ 20 నుంచి ఎన్ కన్వెన్షన్‌లో కార్యకలాపాలు నడుస్తున్నాయి. సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్స్‌కు దీన్ని అద్దెకు ఇస్తున్నారు.

కోమటిరెడ్డి లేఖతో..

నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని.. ఈ నెల 21న సీఎం రేవంత్‌ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ హైడ్రాను ఆదేశించారు. దీంతో కోమటిరెడ్డి లేఖపై హైడ్రా కమిషనర్ విచారణ జరిపారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్‌టీఎల్‌లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు మంత్రి లేఖలో వివరించారు. శాటిలైట్ ఫోటోలతో సహా ఇతర ఆధారాలను హైడ్రాకు ఇచ్చారు. కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా.. కూల్చివేతకు రంగం సిద్ధం చేసి నేలమట్టం చేసింది.

టాపిక్

HyderabadNagarjunaTelangana NewsTs PoliceTelugu NewsTelugu CinemaRevanth Reddy

Source / Credits

Best Web Hosting Provider In India 2024