Best Web Hosting Provider In India 2024
శ్రీ కృష్ణాష్టమి రోజు వివిధ ప్రాంతాల్లో కన్నయ్యకు అనేక ప్రసాదాలు సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని చోట్ల ప్రత్యేకంగా తయారు చేసిన కాయం చిన్ని కృష్ణునికి నైవేద్యంగా పెడతారు. ఇది కన్నయ్యకు ఇష్టమైన నైవేద్యమనీ చెబుతారు. ఈ రోజు చాలా గుళ్లలో ప్రసాదంగా ఈ కాయాన్నే ఇస్తారు కూడా. అయితే దీనికి మరో ప్రత్యేకత ఉంది. మహిళ ప్రసవం తర్వాత అంటే బాలింతలకు కూడా ఈ కాయాన్ని చేసిస్తారు. దీనివల్ల బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుందని చాలా చోట్ల రోజూ ఒక చిన్న లడ్డు లాగా చేసి తినిపిస్తారు. అంతేకాదూ వాళ్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటుందనీ నమ్ముతారు.ఇంతకీ ఈ కాయాన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుండి.
కాయం తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 చెంచాల జీలకర్ర
2 చెంచాల వాము
2 టీస్పూన్ల మిరియాలు
2 చిన్న ముక్కల శొంఠి
4 చెంచాల బెల్లం తురుము
1 చెంచా నెయ్యి
కాయం తయారీ విధానం:
1. ముందుగా ఒక అడుగు మందం ఉన్న కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో జీలకర్ర, వాము, మిరియాలు, శొంఠి ఒక్కోటి వేసుకుని రెండు నిమిషాలు సన్నం మంట మీద వేయించుకోవాలి.
2. స్టవ్ కట్టేసి వీటిని ఒక పళ్లెంలోకి తీసుకోవాలి.
3. అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి పట్టుకోవాలి. చివరగా బెల్లం తురుము వేసి మరోసారి తిప్పితే కాస్త ముద్దలా పొడి అవుతుంది. కొన్ని చోట్ల బెల్లానికి బదులు పంచదారను కూడా వాడతారు.
4. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
5. ప్యాన్లో నెయ్యి వేసుకుని కరిగించుకోండి. కాస్త వేడెక్కాక ముందు పట్టుకున్న పొడిలో వేసుకుని కలుపుకోండి.
6. నెయ్యితో పొడిని బాగా కలిపేసుకున్నాక చిన్న చిన్న ఉండలు కట్టి పెట్టుకోండి. కొన్ని చోట్ల నెయ్యి కలపకుండా నేరుగా పొడినే కాయం అని చెప్పి నైవేధ్యంగా పెడతారు. కొన్ని చోట్ల నెయ్యి కలిపి ఈ పొడితో చిన్న లడ్డూలు చేసి నివేదిస్తారు. తయారీ పద్దతి మాత్రం ఇదే.
బాలింతల కాయం:
ఈ కాయంతో నెయ్యి వేసి చేసిన చిన్న చిన్న లడ్డూలను బాలింతలు రోజూ పరిగడుపున ఒకటి తినడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని చెబుతారు. బాలింతల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా వీటిలో ఉన్న ఆయుర్వేద గుణాలు కాపాడతాయి. ఇవి ఒక్కసారి తయారు చేసి గాలి చొరవని డబ్బాలో పెట్టుకున్నారంటే రెండు నెలలైనా పాడవ్వవు. కొంతమంది ఈ ఉండలనే పసుపులో వేసి నిల్వ చేస్తారు. పసుపు ఈ ఉండల్లో ఉన్న తేమ పీల్చుకుని వాటిని పాడవ్వకుండా చేస్తుంది. చిన్ని కృష్ణుని ప్రసాదమే బాలింతలకు ఔషధంగా పెట్టడం మన సాంప్రదాయంలో ఉన్న లోతైన అర్థాల్ని తెలియజేస్తుంది.
టాపిక్