Malayalam Actor: న‌న్ను రేప్ చేశాడు -మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీపై న‌టి లైంగిక‌ ఆరోప‌ణ‌లు -ప‌ద‌వికి రాజీనామా

Best Web Hosting Provider In India 2024


Malayalam Actor: మ‌ల‌యాళ సీనియ‌ర్ న‌టుడు సిద్ధిఖీ త‌న‌ను రేప్ చేశాడంటూ న‌టి రేవ‌తి సంప‌త్ చేసిన ఆరోప‌ణ‌లు మాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతోన్నాయి. మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా సిద్ధిఖీ కొన‌సాగుతోన్నాడు. ఈ లైంగిక ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సిద్ధిఖీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. ఆదివారం త‌న రాజీనామా లేఖ‌ను ప్రెసిడెంట్ మోహ‌న్ లాల్‌కు అంద‌జేశాడు.

ట్రాప్ చేశాడు…

సిద్ధిఖీ ట్రాప్ చేసి త‌న‌ను రేప్ చేశాడంటూ రేవ‌తి సంప‌త్ ఆరోపించింది. త‌న‌తో పాటు త‌న స్నేహితుల‌ను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాలంటూ రేవ‌తి సంప‌త్ చేసిన వ్యాఖ్య‌లు మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం…

సిద్ధిఖీ త‌న‌ను సోష‌ల్ మీడియా ద్వారా కాంటాక్ట్ అయ్యాడ‌ని రేవ‌తి సంప‌త్ చెప్పింది. “నాకు న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తిని గ‌మ‌నించిన సిద్ధిఖీ…త‌న సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని మ‌భ్య‌పెడుతూ వ‌చ్చాడు. సిద్ధిఖీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సుఖ‌మ‌యిరిక్క‌ట్టే ప్రీమియ‌ర్ షోకు న‌న్ను ఆహ్వానించాడు. షో ముగిసిన త‌ర్వాత న‌న్ను తిరువ‌నంత‌పురంలోని మ‌స్క‌ట్ హోట‌ల్‌కు తీసుకెళ్తాడు. హోట‌ల్ రూమ్‌లో సిద్ధిఖీ నాతో అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు.

నాపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. న‌న్ను రేప్ చేశాడు. ఎదురుతిరిగినందుకు భౌతికంగా దాడి చేశాడు. అదంతా ఓ ట్రాప్ అని త‌ర్వాత అర్థ‌మైంది. హోట‌ల్‌లో ఉన్న గంట‌ ఎంతో న‌ర‌కం అనుభ‌వించాను.ఎలాగోలా ఆ హోట‌ల్‌ నుంచి త‌ప్పించుకున్నాను. కానీ ఆ భ‌యాన‌క అనుభ‌వం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి మాత్రం నాకు చాలా రోజులు ప‌ట్టింది” అని రేవ‌తి సంప‌త్ చెప్పింది.

స్నేహితుల‌పై వేధింపులు…

సిద్ధిఖీ న‌న్ను ఒక్క‌దానినే కాదు ఎంతో మందిని లైంగికంగా వేధించాడు. అత‌డి కార‌ణంగా నా స్నేహితులు చాలా మంది ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు అంటూ రేవ‌తి సంప‌త్ అన్న‌ది. ఆమె ఆరోప‌ణ‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. మీడియాలో అటెన్ష‌న్‌తో పాటు లైమ్‌లైట్‌లోకి రావ‌డానికే రేవతి సంప‌త్ ఈ ఆరోప‌ణ‌లు చేసిందంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తోన్నారు. మ‌రికొంద‌రు మాత్రం రేవ‌తి సంప‌త్ ఆరోప‌ణ‌ల్లోనిజం ఉండొచ్చ‌ని అంటున్నారు.

ఇది మొద‌టిసారి కాదు…

సిద్ధిఖీపై రేవ‌తి సంప‌త్ లైంగిక ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదు. 2021లో సిద్ధిఖీ, ద‌ర్శ‌కుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌తో పాటు మ‌రికొంద‌రు త‌న‌ను వేధించారంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో కొంద‌రు పోలీసులు, లాయ‌ర్లు కూడా ఉండ‌టంతో అప్ప‌ట్లో రేవ‌తి సంప‌త్ పోస్ట్ హాట్ టాపిక్ అయ్యింది.

హేమ క‌మిటీ…

కాగా మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న వేధింపుల‌పై జ‌స్టిస్ హేమ క‌మిటీ ప్ర‌భుత్వానికి ఇటీవ‌ల‌ ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్‌కు సంబంధించి మ‌ల‌యాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ గ‌త శుక్ర‌వారం ఓ స‌మావేశాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపుల‌ను స‌హించేది లేద‌ని, బాధితుల‌కు అసోసియేష‌న్ అండ‌గా ఉంటుంద‌ని సిద్ధిఖీ పేర్కొన్నాడు. ఆ త‌ర్వాత రోజు అత‌డిపై ఆరోప‌ణ‌లు రావ‌డం గ‌మ‌నార్హం. సిద్ధిఖీ మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో 350కిపైగా సినిమాలు చేశాడు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024