Hydra: వామ్మో.. హైడ్రా ఇంత సీక్రెట్‌గా పని చేస్తుందా.. ఎంతైనా రంగనాథ్ స్టైలే వేరు!

Best Web Hosting Provider In India 2024


తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హైడ్రా పేరు మారుమోగుతోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీంతో అసలు హైడ్రా ఎలా పనిచేస్తుంది.. దీన్ని లీడ్ చేసే ఐపీఎస్ అఫీసర్ ఏవీ రంగనాథ్ ఏం చేస్తున్నారు.. హైడ్రా లీస్ట్‌లో ఇంకా ఎవరి అక్రమ కట్టడాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి మరీ..

హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైదరాబాద్ నగరంలోని చింతల్‌ చెరువులో ఒకేరోజు 50 భవనాలను నేలమట్టం చేశారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో గండిపేట జలాశయం దగ్గర 20 భవనాలను కూల్చేశారు. కాటేదాన్‌లో ఒక చెరువులోని ఆక్రమణలను కూల్చేస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యే అడ్డువచ్చారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి మరీ హైడ్రా బృందం తన పనిని పూర్తి చేసింది.

3 వేల మంది సిబ్బంది.. ఒక పోలీస్ స్టేషన్..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. ఓఆర్‌ఆర్‌ లోపలి భాగంలో ఉన్న మొత్తం ఆక్రమణల తొలగింపు, రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారు. దీని కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. హైడ్రా కోసం 3వేల మంది సిబ్బందిని నియమిస్తామని.. ఒక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటు సిబ్బంది.. అటు నిధులు ఉండటంతో.. హైడ్రా దూకుడుగా వెళ్తోంది.

ఏరికోరి ఏవీ రంగనాథ్‌ను నియమించారు..

తెలంగాణలో ఎంతో మంది అధికారులు ఉన్నా.. హైడ్రాను లీడ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి.. ఏవీ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించారు. రంగనాథ్ కూడా ఆయన మార్క్ చూపిస్తున్నారు. రంగనాథ్‌ మొదట చెరువుల ఆక్రమణపై సమగ్ర అవగాహన కోసం.. రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ నుంచి శాటిలైట్ చిత్రాలను తెప్పించారు. ఆక్రమణల తీరును నిపుణులతో అంచనా వేయించి జాబితాను సిద్ధం చేశారు.

శని, ఆదివారాల్లో..

హైడ్రా ఏర్పాటైన మొదటి వారం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. భారీ ఆక్రమణలను నేలమట్టం చేసేందుకు హైడ్రా శని, ఆదివారాలను వినియోగించుకుంటోంది. కూల్చివేతల సమాచారాన్ని బయటకు వెళ్లకుండా అత్యంత జాగ్రత్త పాటిస్తున్నారు. సమాచారం బయటకు లీక్ అయితే.. తాము అనుకున్న పని చేయలేకపోతామని.. ఇబ్బందులు ఎదురవుతాయని హైడ్రా జాగ్రత్తలు తీసుకుంటోంది.

లీకైతే సస్పెండ్‌..

కూల్చివేతలపై సమాచారం ఎవరికీ తెలియకుండా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ జాగ్రత్త పడుతున్నారు. కూల్చివేతలకు సంబంధించిన సమాచారం లీకైతే.. బాధ్యులను సస్పెండ్‌ చేస్తామని రంగనాథ్‌ వార్నింగ్ ఇచ్చారు. దీంతో హైడ్రా టీమ్ నోరు మెదపడానికి కూడా భయపడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా.. హైడ్రా సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలను పరిశీలించి.. అనంతరం రంగనాథ్‌తో చర్చించి ప్లాన్ అమలు చేస్తున్నారు. ముందు రోజు రాత్రే సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేసి… తెల్లారి ఉదయమే ఏ కట్టడం కూల్చాలో సమాచారం ఇస్తున్నారు. దీంతో సమాచారం లీక్ కావడం లేదు.

గతంలో నామమాత్రంగా..

గతంలో అక్రమ కట్టడాలు ఉంటే.. బల్దియా, హెచ్‌ఎండీఏ అధికారులు పాక్షికంగా కూల్చడం, స్లాబులకు రంధ్రాలు చేయడంతో సరిపుచ్చేవారు. బల్దియా పరిధిలో ఆక్రమణల తొలగింపు, ఇతరాల కోసం గత ప్రభుత్వ హయాంలో 500 మందితో ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (ఈవీడీఎంఏ)ని ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను ఐపీఎస్‌ అధికారికి అప్పగించారు. ఈ సంస్థ అక్రమాలకు ఆలవాలంగా మారిందన్న ఆరోపణలొచ్చాయి. ప్రస్తుతం ఈవీడీఎంఏను కూడా హైడ్రాలో విలీనం చేశారు. ఇప్పటి హైడ్రా మాత్రం మొత్తం భవనాలను నేలమట్టం చేస్తోంది.

టాపిక్

HyderabadRevanth ReddyIps OfficersTelangana NewsTs Police

Source / Credits

Best Web Hosting Provider In India 2024