Best Web Hosting Provider In India 2024
గ్రూప్ 3 అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ ఆప్షన్ తో సెప్టెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకునే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో తప్పులుంటే అభ్యర్థులు సరిచేసుకోవాలని సూచించింది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం కొలువుల సంఖ్య 1,388 భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ – 3 పరీక్షలను నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం ఖాళీల్లో అత్యధికంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 680 ఉండగా , సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు 436 ఉన్నాయి.
పరీక్షా విధానం :
గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా మూడు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఈ సిలబస్ TGPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
గ్రూప్-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
గ్రూప్ 3లోని మొదటి పేపర్ లో జనరల్ నాల్జెడ్ కి సంబంధించి ఉంటుంది. ఇక పేపర్-2లో మొత్తం 3 అంశాలు ఉండగా.. ప్రతి అంశంపై 50 ప్రశ్నలు.. 50 మార్కులు ఉంటాయి. ఇదే పేపర్‌లో భారత రాజ్యాంగం అంశానికి 50 మార్కులు, భారత చరిత్రకు మరో 50 మార్కులు ఇచ్చారు.
తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశానికి 50 మార్కులు ఉంటాయి. పేపర్-3లో మూడు అంశాలుండగా.. ఒక్కో అంశానికి 50 మార్కులున్నాయి. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు వంటి అంశాలున్నాయి. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు.
గ్రూప్ 2 పరీక్షలు ఎప్పుడంటే..?
మరోవైపు ఇటీవలే గ్రూప్-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
- డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
- డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2
- డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
- డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4
కొద్దిరోజుల కింద డీఎస్సీ పరీక్షలతో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళనల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2ను వాయిదా వేసి డీఎస్సీని మాత్రం వాయిదా వేయలేదు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్ట్ 7, 8 తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ… గ్రూప్ 2 నిర్వహణ కోసం కొత్త తేదీలను వెల్లడించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది.
మొత్తం 783 పోస్టులతో టీజీపీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
టాపిక్