Best Web Hosting Provider In India 2024
బీఫ్ (గోమాంసం) తీసుకెళ్తున్నాడన్న అనుమనంతో రైలులో 72 ఏళ్ల వృద్ధుడిపై దాడి జరిగింది. సంబంధిత వ్యక్తులపై థానేలోని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
జీఆర్పీ కథనం ప్రకారం.. జల్గావ్కు చెందిన అష్రఫ్ అలీ సయ్యద్ హుస్సేన్ ఆగస్టు 28న ధూలే సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా సీటు విషయంలో తోటి ప్రయాణికులతో గొడవకు దిగాడు. అనంతరం రెండు కంటైనర్లలో వండిన గొడ్డు మాంసాన్ని తీసుకెళ్తున్నాడని అనుమానించిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.
ఈ మొత్తం ఘటనకు సంబంధించి తోటి ప్రయాణికులు చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని గమనించిన జీఆర్పీ పోలీసులు.. వృద్ధుడి కోసం గాలింపు చేపట్టారు. థానే జీఆర్పీకి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ చివరికి భివాండిలోని ఆయన కుమార్తె ఇంట్లో హుస్సేన్ని కనుగొని, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వాంగ్మూలం ఆధారంగా దాడి చేసిన ముఠాపై థానే రైల్వే పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
దాడికి పాల్పడిన ఆరుగురిని గుర్తించిన పోలీసులు వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై సెక్షన్ 189(2) (చట్టవిరుద్ధంగా గుమికూడడం), 191(2) (అల్లర్లు), 190 (చట్టవిరుద్ధంగా గుమికూడటం), 126(2) (తప్పుడు సంయమనం), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 324(4) (ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం), 351(2) (నేరపూరిత బెదిరింపు), 352 (ఉద్దేశపూర్వకంగా శాంతికి భంగం కలిగించడం) కింద కేసులు నమోదు చేశారు.
వైరల్ వీడియోలో, హుస్సేన్ని తన్నడానికి, చెంపదెబ్బ కొట్టడానికి ముందు ఆయన తీసుకెళ్లిన రెండు కంటైనర్ల మాంసం గురించి కొందరు ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తానని కూడా వారు బెదిరించినట్టు ఆ వీడియోలో ఆడియో వినిపించింది.
నిందితులను ధూలేలో అదుపులోకి తీసుకున్నామని, వారిని థానేకు తీసుకురావడానికి ఒక బృందాన్ని పంపామని థానే జీఆర్పీకి చెందిన ఓ అధికారి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ, వైరల్ వీడియోను పరిశీలించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఘటన తర్వాత హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని జీఆర్పీ ప్రజలను కోరింది.
హుస్సేన్ స్వయంగా మాట్లాడుతూ, “నా ఆరోగ్యం గురించి నిజంగా ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను బాగానే ఉన్నానని మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నా కుమార్తెను చూడటానికి మాత్రమే వెళుతున్నాను. జరిగింది బాధాకరం. అన్ని వివరాలను పోలీసులకు అందించాను,” అని చెప్పారు.
యువకుడిపై మూకదాడి..
బీఫ్ తిన్నాడన్న అనుమానంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తిని కొందరు కొట్టి చంపిన ఘటన హరియాణాలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ లోని నార్త్ 24 పరగణాల జిల్లాకు చెందిన సబీర్ మాలిక్ (26) తన భార్య, రెండేళ్ల కుమార్తెతో కలిసి చార్ఖీ దాద్రిలోని హంసవాస్ గ్రామంలో నివసిస్తున్నాడు.
“బాధితుడు గొడ్డు మాంసం తిన్నట్లు అనుమానించి నిందితులు అభిషేక్, మోహిత్, రవీందర్, కమల్ జిత్, సాహిల్ ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు అమ్మే నెపంతో ఓ దుకాణానికి పిలిచారు. అక్కడ వారు అతడిని కొట్టారు,” అని ఆ అధికారి పేర్కొన్నారు.
కొందరు జోక్యం చేసుకోవడంతో మాలిక్‌ను మరో ప్రాంతానికి తీసుకెళ్లి మళ్లీ కొట్టారని, దీంతో ఆయన మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
బంధారా గ్రామానికి సమీపంలోని ఓ గుడిసెలో నివసిస్తున్న మృతుడు జీవనోపాధి కోసం వ్యర్థాలు, చెత్తను సేకరించేవాడు.
ఈ కేసులో ఐదుగురు నిందితులతో పాటు ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఈ ఘటనను ఖండించినప్పటికీ గోసంరక్షణపై ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. “మూకదాడులు సరికాదు, కానీ ఇలాంటి సంఘటనలు (గొడ్డు మాంసం తినడం) వెలుగులోకి వచ్చినప్పుడు గ్రామాల ప్రజలు స్పందిస్తారు,” అని సైనీ అన్నారు. గోవుల సంరక్షణ కోసం రాష్ట్ర అసెంబ్లీలో కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చామని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని, ఇక్కడి గ్రామాల్లో గోవులను పూజిస్తారని, ఇలాంటి వాటి గురించి ప్రజలు వింటే ఎవరు అడ్డుకోగలరని ప్రశ్నించారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link