Best Web Hosting Provider In India 2024
సెప్టెంబర్ నెల వచ్చిందంటే.. హైదరాబాద్ ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది. ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో కుండపోత వర్షాలు భాగ్యనగరంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. రహదారులు ఏరులై పారుతున్నాయి. 1908వ సంవత్సరంలో మూసీ మహోగ్రరూపం దాల్చడంతో.. భాగ్యనగరం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు కూడా వరదలు సెప్టెంబర్ నెలలోనే వచ్చాయి. 2000, 2016 సంవత్సరాల్లోనూ ఇదే నెలలో కుండపోత వర్షాలు భాగ్యనగరాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం 1908, 2000, 2016 మాత్రమే కాదు.. హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ మిగిల్చిన చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి.
14 సార్లు వరదలతో అల్లాడిపోయిన హైదరాబాద్..
1591 నుంచి 1908 వరకు 14 సార్లు హైదరాబాద్ నగరం వరదలతో అల్లాడిపోయింది. 1631, 1831, 1903 సంవత్సరాల్లో భారీ వరదలు సంభవించాయి. అప్పుడు భారీగా ధన, ప్రాణ నష్టం జరిగింది. 1908 సెప్టెంబరు వరదలతో హైదరాబాద్ నగరంలో 2 వేల ఇళ్లు కొట్టుకుపోయాయని చరిత్ర చెబుతోంది.15 వేల మంది మృతి చెందారు. 20 వేల మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు వారం రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. 1631లో కుతుబ్ షాహీ ఆరో పాలకుడు.. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో వచ్చిన వరదలకు భవనాలు ధ్వంసం అయ్యాయి. మూసీ నది చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
సెప్టెంబర్ నెలలోనే..
1831లో అసఫ్ జాహీ నాలుగో మీర్ ఫరుకుందా అలీఖాన్ నాసరుదౌలా పాలనా సమయంలోనూ.. భాగ్యనగరంలో భారీ వరదలు సంభవించాయి. అప్పుడు నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్ వంతెన కొట్టుకుపోయింది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్ నెలలోనే భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. 1968, 1984, 2000, 2007, 2016, 2020 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలు కురిసి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు కూడా భారీగా నష్టం వాటిల్లిందని చరిత్ర చెబుతోంది. వేర్వేరు నెలల్లో వర్షాలు వచ్చినా.. సప్టెంబర్‌లో వచ్చిన వర్షాలే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
చరిత్రలో మర్చిపోలేని రోజు..
1908వ సంవత్సరం సెప్టెంబరు 28 హైదరాబాద్ చరిత్రలో మర్చిపోలేని రోజు. మూసీ నది 60 అడుగుల ఎత్తున ప్రవహించి.. మహోగ్రరూపం దాల్చింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో.. హైదరాబాద్ అల్లకల్లోలంగా మారింది. మూసీ.. చాదర్‌ఘాట్ దాటి అంబర్‌పేట బుర్జు వరకు.. అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు వరద పోటెత్తింది. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి.. పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో జనం ఎక్కారు. కానీ.. భారీ ప్రవాహానికి పేట్లబురుజు కూడా కొట్టుకుపోయింది. వందలాది మంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వేల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
అక్టోబర్ కూడా..
కేవలం సెప్టెంబర్ మాసమే కాదు.. అక్టోబర్ కూడా హైదరాబాద్ నగరాన్ని పగబట్టినట్టు ఉంది. అందుకు ఉదాహరణే 2020 అక్టోబర్‌లో వచ్చిన వరదలు. భారీ వర్షాలు పడటం వల్ల హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. భారీ వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి. ప్రాణ నష్టం అంతగా లేకున్నా.. ఆస్తినష్టం మాత్రం భారీగా వాటిళ్లింది. దీంతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. అప్పుడు ఇతర రాష్ట్రాలు, సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటించి.. పేదలను ఆదుకున్నారు. ఇలా దశాబ్దాలుగా హైదరాబాద్ నగరాన్ని సెప్టెంబర్, అక్టోబర్ భయం వెంటాడుతోంది.
టాపిక్