Best Web Hosting Provider In India 2024
ఆయా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులను సూచించేందుకు.. భారత వాతావరణ శాఖ సాధారణంగా నాలుగు కలర్ కోడ్స్‌ను జారీ చేస్తుంది. వాటిల్లో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్స్ ఉంటాయి. రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండొచ్చు అని అంచనా వేసి, సంబంధిత కోడ్స్‌ను ఐఎండీ జారీ చేస్తుంది. అత్యధికంగా ఈ హెచ్చరికలు 5 రోజులు అమల్లో ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఎంత వర్షపాతం ఉంటే ఏ రంగు..
ఒక రోజులో 64 ఎం.ఎం వర్షపాతం నమోదైతే అప్పుడు గ్రీన్ కలర్ అలర్ట్ జారీ చేస్తారు. అదే వర్షపాతం 64.5 ఎం.ఎం నుంచి 115.5 ఎం.ఎం మధ్యలో ఉంటే ఎల్లో అలర్ట్‌ను జారీ చేస్తారు. 24 గంటల వ్యవధిలో వర్షపాతం 115.6 నుంచి 204.4 ఎం.ఎం మధ్యలో ఉంటే ఆరెంజ్ అలర్ట్‌ను ఐఎండీ జారీ చేస్తుంది. ఇక 204.5 ఎం.ఎంకు మించి వర్షపాతం నమోదైతే.. రెడ్ అలర్ట్‌ను జారీ చేస్తారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివాసముండే ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. ఈ హెచ్చరికలు జారీ చేస్తారు.
కలర్స్.. వాటి మీనింగ్..
వాతావరణానికి సంబంధించి అప్డేట్ ఉండి.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పుడు గ్రీన్ కలర్ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణం ప్రతికూలంగా ఉండి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్‌ను జారీ చేస్తారు. వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉందని, విద్యుత్, రైలు, రోడ్డు, విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంటే.. ఆరెంజ్ కలర్ అలర్ట్ జారీ చేస్తారు. ఇక పరిస్థితులు అత్యంత ఆందోళకరంగా ఉన్నప్పుడు.. ప్రజల జీవితాలకు ముప్పు పొంచి ఉందని సూచించేందుకు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో అతి భారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి.
ప్రస్తుతం ఏ జిల్లాకు ఏ అలెర్ట్..
ఐఎండీ హైదరాబాద్ వివరాల ప్రకారం.. తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
ఆరెంజ్ అలెర్ట్..
తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆసీఫాబాద్, మంచిర్యాల పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ చేశారు.
ఎల్లో అలెర్ట్..
మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ -మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
టాపిక్