Best Web Hosting Provider In India 2024
వజైనల్ రింగ్ గురించి చాలా మందికి తెలీదు. గర్భనిరోధక మార్గాలలో ఇదీ ఒకటి. పిల్లల్ని ఆలస్యంగా కనాలనుకున్నా, ఇద్దరి పిల్లల మధ్య ఎడం తీసుకోవాలనుకున్నా వజైనల్ రింగ్ వాడతారు. దీన్ని సరిగ్గా వాడితే 99 శాతం ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడే అవకాశాలున్నాయి. దీన్నెలా వాడాలి? దీన్ని పెట్టుకున్నాక శృంగారంలో పాల్గొనచ్చా? దీనిలో రకాలేంటి? మరిన్ని విషయాలు వివరంగా తెల్సుకోండి.
గర్భనిరోధక మార్గాలు:
గర్భనిరోధక మాత్రలు, కాండోమ్స్, కొన్ని డైవైసులు లాంటి అనేక గర్భనిరోధక మార్గాలున్నాయి. ఏళ్లుగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. వాటిలో వజైనల్ రింగ్ కూడా ఒకటి. సన్నగా, సాగే గుణం ఉండే ఈ రింగును యోని లోపల పెట్టుకుంటారు. గుండ్రని రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుందిది.
వజైనల్ రింగ్ అంటే?
వజైనల్ రింగును ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. యోని లోపల సులభంగా దీన్ని పెట్టుకోవచ్చు. యోనిలోపల పెట్టుకున్నాక ఈస్ట్రోజన్, ప్రొజెస్టిన్ అనే హార్మోన్లను విడుదల చేసి ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతుంది. సాధారణంగా గర్భనిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్లు కూడా ఇవే. ఈ హార్మోన్ల వల్ల అండం విడుదల అవ్వదు. అలాగే గర్భాశయం నుంచి వచ్చే డిశ్చార్జి కూడా పలుచగా కాకుండా కాస్త చిక్కగా మారుతుంది. దీంతో శుక్రకణం కదలిక సులభంగా జరగదు. శుక్రకణం కదలకపోతే అండాన్ని చేరుకోలేదు. ఈ వజైనల్ రింగును మూడు వారాల పాటు పెట్టుకుంటారు. పీరియడ్స్ సమయంలో ఒక వారం దీన్ని పెట్టుకోరు. ఆ తర్వాత మరో కొత్త రింగు పెట్టుకోవాలి. దీంట్లో రీయూజబుల్ రకాలూ ఉంటాయి.
గర్భం రాకుండా ఎలా కాపాడుతుంది?
ఈ రింగ్ విడుదల చేసే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్ హార్మోన్లు యోని నుంచి ద్వారా రక్తంలో కలుస్తాయి.
- ఇవి ప్రతి నెలా విడుదలయ్యే అండం విడుదల కాకుండా చూస్తాయి.
- ప్రొజెస్టిన్ హార్మోన్ గర్బాశయ డిశ్చార్జి చిక్కగా అయ్యేలా చేసి శుక్రకణాల కదలికను కష్టతరం చేస్తుంది. దీంతో అండాన్ని స్పెర్మ్ చేరుకోవడం కష్టం అవుతుంది.
- గర్బాశయ లైనింగ్ ను పలుచగా మార్చి అండం ఫలదీకరణను కష్టతరం చేస్తుంది.
ఈ వజైనల్ రింగును సరిగ్గా వాడితే 99 శాతం గర్బం రాకుండా కాపాడుతుంది.
వజైనల్ రింగ్ ఎలా వాడాలి?
- ముందుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
- మీ బొటన వేలు, చూపుడు వేలు మధ్యలో ఈ రింగ్ పట్టుకుని నొక్కాలి. మెల్లగా యోనిలోకి ఈ రింగును చొప్పించాలి. మీకు సౌకర్యంగా అనిపించేంత వరకు కాస్త పైకి నొక్కాలి.
- పీరియడ్స్ సమయంలో వారం రోజులు ఈ రింగు తీసేయాలి. సరిగ్గా వారం రోజుల తర్వాత అదే రోజున కొత్త రింగును మళ్లీ పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే గర్బం రాకుండా ఫలితం ఉంటుంది.
శృంగారంలో పాల్గొనవచ్చా?
అవును, వజైనా రింగు పెట్టుకుని శృంగారంలో పాల్గొంటే ఏ సమస్యా లేదు. శృంగారంలో పాల్గొన్నా కూడా ఇది అటూ ఇటూ జరగకుండా దీని డిజైనింగ్ ఉంటుంది. అమ్మాయిలకు శృంగార సమయంలో ఈ రింగు ఉన్నట్లు కూడా తెలీదు. అబ్బాయిలకు కాస్త స్పర్శ తెలిసే అవకాశం ఉందంతే. తప్ప అసౌకర్యం ఉండదు. ఒకవేళ శృంగార సమయంలో ఈ రింగు తీసేస్తే మరో మూడు గంటల్లోపే పెట్టుకోవాలి. లేదంటే ఏ ఫలితం ఉండదు.
వజైనల్ రింగ్ రకాలు:
ఈ రింగుల్లో రెండు రకాలుంటాయి. వైద్య సలహాతో వీటిని మీరు వాడుకోవచ్చు. ఒకటేమో నెలకోసారి పీరియడ్స్ సమయంలో తొలగించి కొత్తది పెట్టుకోవాల్సి ఉంటుంది. మరో రకం సంవత్సరం పొడవునా వాడుకోగలిగే రీయూజబుల్ రకం.
టాపిక్