AP TG Transport Stall : జలమయమైన జాతీయ రహదారులు-ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్

Best Web Hosting Provider In India 2024


AP TG Transport Stall : భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగే జాతీయ రహదారులు నీట మునిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ, ఏపీ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు పొంగి ప్రవహిస్తుంది. కోదాడ నుంచి వరదనీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

హైదరాబాద్-విజయవాడకు నిలిచిన రాకపోకలు

హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద 65వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మోకాళ్ల లోతులో వరద ప్రవహిస్తుండడంతో అధికారులు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద, హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. వరద తగ్గేవరకు హైవేపై వాహనాలను అనుమతించమని అధికారులు వెల్లడించారు. వరద తగ్గిన తర్వాత కాసేపు రాకపోకలు సాగాయి. మళ్లీ మున్నేరు వరద పెరగడంతో మరోసారి రాకపోకలను నిలిపివేశారు.

నల్లబండగూడెం వద్ద పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోని 30 మంది ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. రోడ్లపైకి నీరు చేరడంతో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు.

డోర్నాల-శ్రీశైలం మధ్య రాకపోకలు బంద్

భారీ వర్షాలతో ఆత్మకూరు-డోర్నాల, డోర్నాల-శ్రీశైలం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ మార్గాల్లో పలుచోట్ల రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భవనాశి వాగు పొంగడంతో ఆత్మకూరు-కొత్తపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఆత్మకూరు-దుద్యాల, ఆత్మకూరు-వడ్లరామాపురం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. గుండ్లకమ్మ వాగు పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్డుపై రఘునాథ్ పల్లి వద్ద భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం వైపు వెళ్లొద్దని నాగర్ కర్నూల్ పోలీసులు హెచ్చరించారు. భారీ వర్షాలకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఇబ్బందులు ఎదురవుతాయని.. అందుకే ఆ మార్గంలో ప్రయాణించొద్దని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాండ్ సూచించారు. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లమల కొండల మీద నుండి ప్రమాదకర స్థాయిలో వరద నీరు వస్తోంది. శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం ఆలయం మీదకు వరద నీరు జాలు వారుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. వరద ఉద్ధృతంగా వస్తోందని అధికారులు చెబుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని.. పోలీసులు సాహసోపేతంగా కాపాడారు.

సంబంధిత కథనం

టాపిక్

Ap Heavy RainsAp RainsTs RainsHyderabadVijayawadaAndhra Pradesh NewsTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024