Best Web Hosting Provider In India 2024
Young Scientist Died : తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో యువ శాస్త్రవేత్త డా.నునావత్ అశ్విని మృతి చెందారు. తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాయ్‌పూర్‌లోని ఐసీఏఆర్ కు చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన అశ్విని, ఆమె తండ్రి నునావత్ మోతీలాల్‌లు కారులో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్నారు. వారి కారు మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమయ్యగూడెం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న ఆకేరువాగులో కొట్టుకుపోయింది. వంతెన మీదుగా ప్రవహిస్తున్న వరదలో కారు డ్రైవ్ చేయడంతో వాహనం అదుపుతప్పి నీటిలోకి పడిపోయింది. ఆదివారం ఆకేరువాగు వంతెన సమీపంలో డాక్టర్ అశ్విని మృతదేహం లభ్యమైంది. ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహం కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి.
హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని రిజర్వాయర్లు నిండుతున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండల్లా మారాయి. మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ నది మూసారాంబాగ్ వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. హుస్సేన్ సాగర్‌లో నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) కంటే ఎక్కువగా ఉంది.
ఈ పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయవద్దని అధికారులు కోరుతున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచనలు చేస్తుంది.
టాపిక్