Best Web Hosting Provider In India 2024
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను.. తీసుకున్న జాగ్రత్తలను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానికి తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని అభినందించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని తెలిపారు.
సీఎం రేవంత్ కు అమిత్ షా ఫోన్
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదలతో వాటిల్లిన నష్టాన్ని సీఎం వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షాకు సీఎం తెలిపారు. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామన్నారు. రాష్ట్రస్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇస్తున్నారు.
వీలైనంత వరకు ప్రాజెక్టులను నింపండి- సీఎం రేవంత్ రెడ్డి
భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని సీఎం ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.
కడెం ప్రాజెక్టు, మిడ్‌మానేరు ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యామ్, అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక సాగర్‌కు తరలిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంప్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్