Hyderabad Rains : ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. సైబరాబాద్ పోలీసుల సూచన.. కారణం ఇదే!

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్ నగరంలో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు కంపెనీలకు సూచించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు లేఖ రాశారు. ఐటీ ఉద్యోగులకు సోమవారం వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతించాలని.. ఐటీ కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ సూచించారు.

ట్రాఫిక్ జామ్ ఎర్పడుతోంది..

హైదరాబాద్ నగరంలో వర్షం కారణంగా.. రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్ ఎర్పడుతోంది. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి కార్లు వినియోగిస్తారు కాబట్టి ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే.. ట్రాఫిక్ తగ్గి.. సహాయక చర్యలు తొందరగా చేపట్టే వీలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఆదివారం కుండపోత..

హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్ ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. అనేక వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. గండిపేట, హిమాయత్‌సాగర్‌కు భారీ వరద వచ్చింది. ఎగవ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద చేరింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జంట జలశాయాలను వాటర్‌వర్క్స్‌ అధికారులు పరిశీలించారు.

భట్టీ కీలక ఆదేశాలు..

వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు ఇచ్చారు. రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని హైడ్రాకు డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు సూచించారు. వరదనీరు ఉధృతంగా ప్రవహించే రోడ్లపై వాహనాలను అనుమతించొద్దని పోలీస్‌ శాఖను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

మరో 24 గంటలూ..

తెలంగాణకు మరో 24 గంటల పాటు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌.. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ అయ్యింది. దీంతో ఆయా జిల్లాల అధికారులు అలెర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

టాపిక్

Ts RainsHyderabadImd HyderabadHyderabad TrafficTelangana NewsTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024