ఉమ్మడి కరీంనగర్ జిల్లా‌లో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరదలు.. ఒకరు గల్లంతు

Best Web Hosting Provider In India 2024


ఉప్పొంగిన వాగులతో కాల్వ శ్రీరాంపూర్ మండలం కేంద్రానికి చెందిన చెప్యాల పవన్ నక్కవాగులో గల్లంతయ్యారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. గల్లంతైన పవన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వర్షాకాలం ఆరంభం అయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్‌లో ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలన్ని జలకళను సంతరించుకున్నాయి.‌ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల కొత్తపల్లి గ్రామాల మధ్య నక్క వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బైక్ పై వాగు దాటేందుకు మిర్జంపేట గ్రామ కారోబార్ చెప్యాల పవన్, ఆయన మిత్రుడు ప్రయత్నించగా వరద దాటికి ఇద్దరు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని స్థానికులు రక్షించారు. కారోబార్ పవన్ వరదలో కొట్టుకు పోయాడు. అతని కోసం పోలీసులు గజ ఈతగాళ్ళు గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. పవన్ విదులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

శ్రీపాద ఎల్లంపల్లి 20 గేట్లు ఎత్తివేత

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 20 గేట్లు ఎత్తి లక్షా 40 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.‌ ఇన్ ఫ్లో 105584 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 144168 క్యూసెక్కులు ఉంది.‌ నంది రెండు పంప్ ల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసీలు కాగ ప్రస్తుతం 17.95 TMCల నీరు నిల్వ ఉంది.

ఎంఎంఆర్ నిలకడగా వరద

మిడ్ మానేర్ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వరద పెరిగింది. గత నెల రోజులుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది, గాయిత్రి పంప్ హౌజుల ద్వారా నీటిని ఎత్తిపోశారు. తాజా వర్షాలతో ములవాగు ద్వారా 40591 క్యూసెక్కులు, పంప్ హౌస్ ద్వారా 6300 క్యూసెక్కులు మొత్తం 46891 క్యూసెక్కుల నీరు ఎంఎంఆర్ కు వచ్చి చేరుతుంది. ఔట్ ఫ్లో 6550 క్యూసెక్కులు ఉంది. ఎంఎంఆర్ నుంచి అనంతసాగర్ అన్నపూర్ణ ప్రాజెక్టు‌కు రెండు పంప్ లు ద్వారా 6400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఎంఎంఆర్ పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగ ప్రస్తుతం 16.21 టీఎంసీలు ఉంది.

ఎల్ఎండి‌కి జలకళ

వారం రోజుల క్రితం వరకు ఎడారిని తలపించిన కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ ప్రస్తుతం జలకళను సంతరించుకుంది.‌ వారం రోజుల క్రితం వరకు 5.75 టిఎంసిల నీళ్లు ఉన్న ఎల్ఎండి‌లో తాజా వర్షం వరదలతో 14.37 టిఎంసీలకు నీరు చేరింది.‌ గత వారం రోజుల నుంచి మిడ్ మానేరు నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 8 టీఎంసీల వరకు ఎల్ఎండికి తరలించిన అధికారులు, తాజా వర్షాలతో మోయతుమ్మెద వాగు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మిడ్ మానేర్ నుంచి నీటిని నిలిపివేశారు. ఎల్‌ఎం‌డి‌కి ప్రస్తుతం 18,320 క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్‌ఎం‌డి అవుట్‌ ఫ్లో 267 క్యూసెక్కులు ఉంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14. 37 టీఎంసీల నీరు ఉంది.

సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్

వర్షం వరదల పరిస్థితిని క్షేత్రస్థాయిలో ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఎల్ఎండి నీటి ప్రవాహంతో పాటు నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు.‌ లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షం, వరదలపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ లో వర్షం వరదలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే మానేర్ డ్యామ్ లతో పాటు రంగనాయక సాగర్, కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ లు నిండే అవకాశం లభించడం శుభసూచకమన్నారు. గత ప్రభుత్వ ఆనాలోచి విధానాలకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు.

వర్షం, ప్రాజెక్టులు, వ్యవసాయాన్ని రాజకీయంగా వాడుకోవడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వం పై విమర్శలు చేసిన మంత్రి పొన్నం వర్షం వరదల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం తో పాటు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.

-రిపోర్టింగ్: కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్

టాపిక్

Ponnam PrabhakarKarimnagarTelangana NewsTs RainsFloodsGodavari Floods

Source / Credits

Best Web Hosting Provider In India 2024