పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు మృతి.. వరదల్లో ఇద్దరు, కరెంట్ షాక్‌తో మరొకరు

Best Web Hosting Provider In India 2024


రెండు రోజులపాటు కురిసిన వర్షం కాస్త శాంతించింది. మిగతా జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాస్త వర్షం వరదల బీభత్సం తక్కువే అయినప్పటికీ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రాత్రి నుంచి వర్షం లేకపోవడంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

వాగులో పడి మృతి

వర్షం వరదలతో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన చెప్యాల పవన్ నక్కవాగులో గల్లంతయ్యాడు. మిర్జంపేట గ్రామ కారోబార్ గా పనిచేసే పవన్ పనులు ముగించుకుని స్వగ్రామం కాల్వ శ్రీరాంపూర్ కు బైక్ పై వెళ్తుండగా కొత్తపల్లి మల్యాల మద్య ఉదృతంగా ప్రవహించిన నక్క వాగులో కొట్టుకుపోయాడు. సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.

చెరువులో పడి మృతి

వీణవంక మండలం బేతిగల్ కు చెందిన మత్స్యకారుడు గోస్కుల కుమార్ కూనారం చెరువులో పడి మృతి చెందాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం చెరువు మత్తడి దూకుతుండగా చేపపిల్లలు కొట్టుకుపోకుండా వలలు వేసేందుకు ప్రయత్నించగా వరద దాటికి కొట్టుకుపోయాడు.

కరెంటు షాక్‌తో

రామగిరి మండలం రాజాపూర్ లో వర్షానికి కరెంట్ షాక్ తో మహిళ రాజమ్మ మృతి చెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పంట పొలాలు నీటమునిగాయి. ఎలిగేడు మండలం లాలపల్లి శివారులోని కొప్పెరకుంట చెరువుకు గండిపడడంతో వందలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. భారీగా నష్టం వాటిల్లింది. నష్టం అంచనావేసి పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

జలాశయాలకు జలకళ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. వరదలు పోటెత్తడంతో జలాశయాలన్ని జలకళను సంతరించుకున్నాయి. చెరువులు కుంటలు నిండి అలుగు మారుతున్నాయి.‌ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.‌ 30 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేశారు. ఇన్ ఫ్లో 450184 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో ఆరు లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టిఎంసి లు కాగ ప్రస్తుతం 18.786 టిఎంసిల నీరు ఉంది.

ఎగువన ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఎల్లంపల్లికి వరద పోటెత్తింది. అటు సుందిళ్ల పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వచ్చి చేరుతుంది. గేట్లన్ని 74 ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి భారీగా నీటి విడుదలతో వచ్చిన నీళ్లను వచ్చినట్లు వదిలేస్తున్నారు అధికారులు.

వారం రోజుల క్రితం వరకు డెడ్ స్టోరేజ్ తో ఎడారిని తలపించిన కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ లో 15 టిఎంసీలకు నీరు చేరింది. ఇక మిడ్ మానేర్ శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ కు భారీ గా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 62,194 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 6550 క్యూసెక్కులు ఉంది.

27.54 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 17.91 టిఎంసీలకు నీరు చేరింది. మిడ్ మానేర్ నుంచి రెండు మోటర్ల ద్వారా అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ కు 6400 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు.‌ మిడ్ మానేర్ పైన ఉన్న ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. మూడేళ్ళ తర్వాత మత్తడి దూకుతుండడంతో మానేర్ జలకళను చూసేందుకు జనం తరలివస్తున్నారు. మత్తడి వైపు ఎవరు వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారు.

రాకపోకలు బంద్

వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు ఉండనిచిపోయాయి. జగిత్యాల జిల్లా అనంతారం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో జగిత్యాల ధర్మపురి మద్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెగడపల్లి మండలం వెంగళాయిపేట రహదారి బ్రిడ్జి పై ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో పెగడపల్లి చిల్వాకోడూర్ మద్య రాకపోకలు బంద్ అయ్యాయి.

ధర్మపురి నక్కలపేట ప్రధాన రహదారిపై మహ వృక్షం విరిగిపడడంతో నక్కలపేట దొనూర్ గాదేపల్లి తీగలధర్మారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శంకరపట్నం మండలం అర్కండ్ల వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో కన్నాపూర్ చల్లూరు మద్య రాకపోకలు స్థంబించాయి. ఇలా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా వరద క్రమంగా తగ్గుతుండడంతో రాకపోకలు కొనసాగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

-రిపోర్టింగ్: కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్

టాపిక్

KarimnagarTs RainsFloodsGodavari FloodsPeddapalli

Source / Credits

Best Web Hosting Provider In India 2024