Best Web Hosting Provider In India 2024
భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 20కిపైగా మంది మృతి చెందారు. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయం కావడంతో రోడ్డు, రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. అనేక లోతట్టు ప్రాంతాలతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది.
రెండు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగడంతో జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు వేలాది మందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నాయి. కాగా సాయం కోసం ఇంకా చాలా మంది ఎదురుచూస్తున్నారు.
మరోవైపు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు ప్రజల్లోని భయాందోళనలను మరింత పెంచుతున్నాయి.
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల పరిస్థితి..
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
- వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9 మంది మృతి చెందారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ముంపునకు గురైన పలు గ్రామాల ప్రజలను స్థానిక యంత్రాంగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించి, ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సెప్టెంబర్ 2న జిల్లాలోని అన్ని పాఠశాలలను అధికారులు మూసివేశారు. ఖమ్మంలో నీరు నిలవడంతో పలువురు పైకప్పులపై చిక్కుకుపోయారు.
- తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో సెప్టెంబర్ 2న ఉదయం 8.30 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ తర్వాత కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
- అటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- విజయవాడ, గుంటూరు నగరాలు పూర్తిగా జలమయమయ్యాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాజా వద్ద విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి, జగ్గయ్యపేట వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి నీట మునిగాయి. జగ్గయ్యపేటలో 24 గంటల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 14 మండలాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
- కొల్లేరు సరస్సుకు మళ్లించాల్సిన వరద నీరు విజయవాడ వైపు మళ్లుతోందని సీఎం తెలిపారు. ప్రకాశం బ్యారేజీ దిగువన ఇసుక బస్తాలు, ఇతర మార్గాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశామని చెప్పారు.
- ఆంధ్రప్రదేశ్ వర్షాల నేపథ్యంలో 17 వేల మందిని 107 సహాయ శిబిరాలకు తరలించినట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. 1.1 లక్షల హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాలు, 7,360 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.
- విజయవాడ డివిజన్‌తో కూడిన దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆదివారం 140 రైళ్లను రద్దు చేయగా, మరో 97 రైళ్లను దారి మళ్లించింది.
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం 26 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దింపింది. ఇప్పటికే రెండు పొరుగు రాష్ట్రాల్లో 12 బృందాలను మోహరించగా, మరో 14 బృందాలను పంపిస్తున్నారు.
- క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను వరద నీరు ముంచెత్తింది. చాలా భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ నీట మునిగిపోయింది. ప్రజలు ప్రాణ భయంతో పై అంతస్థుల్లో ఆశ్రయం పొందుతున్నారు. కరెంట్ కూడా లేకపోవడంతో ఫోన్లు ఛార్జింగ్‌లు లేక ఇబ్బందిపడుతున్నారు. ఆహారం కూడా అందక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link