Best Web Hosting Provider In India 2024
Garikapadu NH Road : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రహదారుల పై నుంచి వరద ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ సరిహద్దులో గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద సరకు లారీలను నిలిపివేశారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో మరో మార్గం లేక లారీలు, కార్లు, ఇతర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనదారులు రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. రాత్రి నుంచి రోడ్లపైనే ఉంటూ, అక్కడే భోజనాలు చేస్తున్నారు. కోదాడ వరకు వస్తున్న వాహనాలను పోలీసులు మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. వాహనదారులు కోదాడ వైపు రావద్దని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి కోరుతున్నారు.
ఉద్ధృతంగా పాలేరు
ఏపీ, తెలంగాణను కలిపే పాలేరు వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. పాలేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రోడ్డు కుంగిపోయింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం దాటిన తర్వాత రామాపురం ఎక్స్ రోడ్డు వద్ద వంతెన చివర్లో రోడ్డు కుంగిపోయింది. ఏపీలోని చిల్లకల్లు, నందిగామ వద్ద ఎన్.హెచ్ 65 పై వరద నీరు చేరింది. భారీ వర్షాల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతే తప్ప ప్రయాణం మానుకోవాలని పోలీసులు సూచించారు.
టాపిక్