Best Web Hosting Provider In India 2024

విజయవాడ: ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాలలోపు సాగు చేస్తున్న ప్రతి ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని ఆక్వా సాధికారిత కమిటీ సభ్యులు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శాస్త్రీయంగా నిర్వహించిన ఈ ఫిష్ సర్వే వల్ల లక్షలాది మంది అర్హులైన చిన్న ఆక్వా రైతులకు ప్రభుత్వ సబ్సిడీ చేరువ అయ్యిందన్నారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం 6వ ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఆక్వా జోన్ పరిధిలో పది ఎకరాలలోపు సాగు చేస్తున్న ప్రతి ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఫిష్ సర్వే ద్వారా అర్హులైన ఆక్వా రైతులను గుర్తించడం జరిగిందని అన్నారు. సర్వే తరువాత రాష్ట్రంలో 46,445 మంది రైతులను అర్హులుగా నిర్ధారించడం జరిగిందని, దాదాపు 3,27,575 ఎకరాలకు, విద్యుత్ సబ్సిడీగా ఏటా రూ.672.61 కోట్లు అందిస్తున్నామని తెలిపారు.