Best Web Hosting Provider In India 2024

విజయవాడ: హజ్ యాత్రికులపై అదనపు భారం పడకుండా ఆదుకుని అండగా నిలిచిన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ హజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ గౌస్‌లాజమ్ అధ్యక్షతన విజయవాడలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ గౌస్‌లాజమ్ మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,813 మందిపై దాదాపు రూ.83 వేల వంతున అదనపు భారం పడుతుందని సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించారని చెప్పారు.
రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చిన సీఎం వైయస్ జగన్ రూ.14.51 కోట్లు విడుదల చేయడం ముస్లిం సమాజం పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సమావేశం సీఎం వైయస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. హజ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సమావేశంలో చర్చించారు. హజ్ యాత్రికులకు బస, భోజనం, నీరు, రవాణా తదితర ఏర్పాట్లుకు హజ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు.