పోలవరానికి `చంద్ర`గ్రహణం!

Best Web Hosting Provider In India 2024

బాబు చారిత్రక తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!

పోలవరంలో చంద్రబాబు నిర్వాకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ

అవే అంశాలను పునరుద్ఘాటిస్తూ ఈనెల 20న పీపీఏ, సీడబ్ల్యూసీలకు కమిటీ నివేదిక

ఆగస్టు 12న ఇచ్చిన నివేదికపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా మరోసారి నివేదిక

బాబు సర్కార్‌ చారిత్రక తప్పిదాలను బహిర్గతం చేసిన నిపుణుల కమిటీ

వరదను మళ్లించేలా స్పిల్‌వే పూర్తి చేయకుండానే 2016లోనే కాఫర్‌ డ్యాం, ప్రధాన డ్యాం పునాదుల పనులు ప్రారంభం

2018లో ఎగువ కాఫర్‌ డ్యాం పునాది జెట్‌ గ్రౌటింగ్‌ వాల్, ప్రధాన డ్యాం గ్యాప్‌–2 పునాది డయాఫ్రం వాల్‌ మీదుగా వరద ప్రవాహం

ఆ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టని టీడీపీ సర్కారు

గోదావరి వరద ఉద్ధృతికి కోతకు గురై 27 చోట్ల జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌లో చీలికలు.. డయాఫ్రం వాల్‌ 485 మీటర్లు ధ్వంసం

ప్రధాన డ్యాం గ్యాప్‌–2, గ్యాప్‌–1 నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై గరిష్టంగా 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు 

ఫర్మియబులిటీని తప్పుగా లెక్కగట్టి.. 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాల్సిన జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను కేవలం 20 మీటర్ల లోతు నుంచే నిర్మించడం వల్లే ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీ

అమరావతి: అవగాహనా రాహిత్యం.. ప్రణాళికా లోపం.. అస్తవ్యస్థ పనులు.. చారిత్రక తప్పిదాలు..! గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ పనులను చేపట్టడం! ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం! కాఫర్‌ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్‌ కోతకు గురై దెబ్బతింది. 

వెరసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారు!! పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇదీ! ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ ధ్వంసం కావడానికి.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి.. ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీ (ఊట నీటి లీకేజ్‌)కి ముమ్మాటికీ చంద్ర­బాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక మరోసారి నిర్ధారణ అయింది. 

ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 12న తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఈ నెల 20వ తేదీన పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. 

పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్‌ బి.పాల్, గియాస్‌ ఫ్రాంకో డి. సిస్కో (యూఎస్‌ఏ), రిచర్డ్‌ డొన్నెళ్లీ, సీస్‌ హించ్‌­బెర్గర్‌ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ, సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. 

అనంతరం పూర్తి స్థాయి నివేదికను 12న పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పటిష్టత, సీపేజీ, డయాఫ్రం వాల్‌ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. 

ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. 
2018 నాటికే జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌కు 27 చోట్ల భారీ చీలికలు
⇒ గోదావరిపై గ్యాప్‌–2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా 2,450 మీటర్ల పొడవున ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించాలి. వరద ఉద్ధృతి (ఫర్మియబులిటీ)ని పక్కాగా లెక్క వేస్తే.. ఎగువ కాఫర్‌ డ్యాం పునాది జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను ఏ స్థాయి నుంచి తవ్వాలన్నది నిర్ణయించవచ్చు. కానీ ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఫర్మియబులిటీని సెకనుకు కనిష్టంగా 5్ఠ10–2 మీటర్లు ఉండగా.. 5్ఠ10–4 నుంచి 5్ఠ10–5గా లెక్కగట్టారు. 

⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించడం వల్ల జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్‌ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే ఇందులో కమీషన్ల దాహం స్పష్టమవుతోంది.

⇒ 2018లో గోదావరి ప్రవాహం జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉద్ధృతికి జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌లో చెయినేజ్‌ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో బ్లాక్‌ కాటన్‌ సాయిల్‌ (నల్ల బంక మట్టి) వేసి మరమ్మతు చేసి 2018 డిసెంబర్‌లో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు.  

⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించి తక్కువ లోతు నుంచి జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను నిర్మించడం వల్లే ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీ (ఊట నీరు) అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.

ఆ చారిత్రక తప్పిదం వల్లే..
⇒ పోలవరం వద్ద భూభౌగో­ళిక పరిస్థితుల రీత్యా నదికి ఆవల కుడివైపున స్పిల్‌వే నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి.. నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యాం(ఎర్త్‌ కమ్‌రాక్‌ ఫిల్‌ డ్యాం)ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది.

⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ ప్రకారం తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూర్తి చేసి వాటి మధ్యన ప్రధాన డ్యాం పనులు చేపట్టి పూర్తి చేయాలి. 

⇒ కానీ.. 2016 డిసెంబర్‌లో చంద్రబాబు హయాంలో ఒకేసారి స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్‌ పనులను ప్రారంభించారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్‌ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్‌ 1485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1006 మీటర్లు.. 2017 డిసెంబర్‌ నుంచి 2018 జూన్‌ వరకూ చెయినేజ్‌ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో  డయాఫ్రమ్‌ వాల్‌ను నిర్మించారని పేర్కొంది.

⇒ నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేయక పోవడంతో 2018లో గోదావరి ప్రవాహాన్ని డయాఫ్రం వాల్‌ మీదుగా వదిలేశారని నిపుణులు కమిటీ గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రం వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించింది. దాంతో డయాఫ్రం వాల్‌ నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని పునరుద్ఘాటించింది.

ప్రణాళికాబద్ధంగా పనులు..
⇒ నాడు చంద్రబాబు సర్కార్‌ హయాంలో గాడి తప్పిన పోలవరం పనులను 2019 మే 30న అధికారంలోకి వచ్చి­న వైయ‌స్ఆర్‌సీపీ ప్రభు­త్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌పై  వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తు చేసింది.

⇒ 2019 వర్షాలు ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాపర్‌ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలు వదలడం వల్ల కోతకు గురికాకుండా గత ప్రభుత్వం సమర్థంగా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే 2018 వరదలలోనే డయాఫ్రమ్‌ వాల్‌ జెట్‌ గౌటింగ్‌ వాల్‌ దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.

⇒ గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. 

⇒ ఎగువ కాఫర్‌ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది. గోదావరికి గరిష్ట స్థాయిలో వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్‌ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచుతూ 2022లో పనులు చేపట్టి పూర్తి చేసింది.

⇒ దిగువ కాఫర్‌ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్ర­వరి నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది. 

⇒ ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం­లు రెండూ పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్ర­తకు వచ్చిన ముప్పేమీ లేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.  

నిజాలను ప్రతిబింబించిన నివేదిక..
ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్‌ డ్యాంలు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్‌ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. 

గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్‌ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్‌ కోతకు గురై దెబ్బతింది. 

ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్ర బాబుదేనని నీటిపారుదల రంగ నిపు­ణులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదినుంచి స్పష్టం చేస్తుండగా.. అదే అంశాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న ఇచ్చిన నివేదికలో అంత­ర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన నివేదికలోనూ అదే అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం.

సకాలంలో కాఫర్‌ డ్యాంలు పూర్తి చేయకపోవడంతో..
⇒ ఎగువ కాఫర్‌ డ్యాం పనులను 2018 డిసెంబర్‌లో ప్రారంభించిన టీడీపీ సర్కారు 100 నుంచి 1,780 మీటర్ల మధ్య 35 మీటర్ల ఎత్తుతో 2019 మార్చి నాటికి చేసి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. 

⇒ దిగువ కాఫర్‌ డ్యాం పునాది జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ను 10 మీటర్ల లోతు నుంచి వేసి.. 540 మీటర్ల పొడవున పనులు చేపట్టి 2019 మార్చి నాటికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. 

⇒ కాఫర్‌ డ్యాంలు, నిర్వాసితులకు పునరావాసం పనులు నత్తనడక సాగుతుండటం.. రుతు పవనాల కాలం సమీపిస్తుండటంతో కాఫర్‌ డ్యాంలలో వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయకుండా వదిలేయాలని 2019 మే 27న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

⇒ 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్‌ డ్యాం ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో వరద ఉద్ధృతి మరింత అధికమై ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.  

Best Web Hosting Provider In India 2024