Best Web Hosting Provider In India 2024
తూర్పుమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రేపటికి (అక్టోబర్ 22) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారనుందని పేర్కొంది. బుధవారం (అక్టోబర్ 23) నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడి ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించనుందంది. గురువారం ఉదయానికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అల్పపీనడం గురువారం (24వ తేదీ) రాత్రి శుక్రవారం తెల్లవారుజామున (25వ తేదీ) తీవ్రతుపానుగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ప్రభావంతో గురు,శుక్రవారాల్లో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బంగాళాఖాతంలో తుపాను నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన తుపాను సంసిద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ నుంచి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుపాను హెచ్చరిక సందర్భంగా తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్