
Best Web Hosting Provider In India 2024

మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామ రాజు ఉత్తర్వులు విడుదల చేశారు. సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)గా, ఎస్ఎలను గ్రేడ్-II ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం)గా పదోన్నతులు ప్రక్రియ జరగనుంది. రోస్టర్ ప్రకటించకుండా పదోన్నతులు నిర్వహిస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రోస్టర్‌పై అయోమయంగా ఉందని మున్సిపల్ ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
ప్రాంతీయ, జిల్లా విద్యా శాఖ అధికారులు ఈ షెడ్యూల్ ప్రకారం పదోన్నతుల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇటీవలి ఉపాధ్యాయ సమస్యలపై ఆయా సంఘాలతో డైరెక్టర్ సమావేశం అయ్యారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు జరుపుతున్న సమయంలో మున్సిపల్ ఉపాధ్యాయులు జరగడం లేదని, ఏళ్ల తరబడి పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యకు ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు లందరూ, జిల్లా విద్యా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్వీస్ అంశాలతో సహా మున్సిపల్ పాఠశాలల పర్యవేక్షణ, పరిపాలనా బాధ్యతలను బదిలీ చేసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ, పంచాయత్ రాజ్ పాఠశాలలకు సంబంధించి అనుసరిస్తున్న విధానంతో సమానంగా మునిసిపల్ ఉపాధ్యాయులకు కూడా వర్తింప చేయాలని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించిందని తెలిపారు.
దీనిని అనుసరించి, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న నాలుగు రకాల మున్సిపల్ టీచర్స్ సర్వీస్ రూల్స్‌ను ఆమోదించింది. ప్రభుత్వ, పంచాయత్ రాజ్ హెడ్‌మాస్టర్స్ / టీచర్స్ సర్వీస్ రూల్స్‌తో సమానంగా వాటికి సవరణలు జారీ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖాధికారులు మున్సిపల్ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్లగానూ, స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్స్‌గానూ తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిందన్నారు.
షెడ్యూల్ ఇదే
- ఈనెల 28న ఎస్ఏ, ఎస్‌జీటీ, గ్రేడ్-2 హెచ్ఎంల సీనియరిటీ జాబితా విడుదల అయింది.
- ఈ జాబితాపై నవంబరు 1 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
- తుది సీనియరిటీ జాబితా నవంబర్ 4న విడుదల చేస్తారు.
- నవంబర్ 6న ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
- నవంబర్ 8న స్కూల్ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యా అధికారులు మున్సిపల్ మేనేజ్‌మెంట్ స్కూల్స్‌లో హెడ్ మాస్టర్స్ గ్రేడ్-II, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు ప్రమోషన్‌లను సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయంలో మార్గదర్శకాలు, సూచనలను అనుసరించడం. మార్గదర్శకాలు, సూచనలను అమలు చేయడంలో ఏదైనా లోపం జరిగితే, దాన్ని గుర్తించి, బాధ్యత వహించే అధికారిపై తగిన క్రమశిక్షణా చర్య తీసుకోబడుతుందని పేర్కొన్నారు.
రోస్టర్ ప్రకటించకుండా పదోన్నతులపై విమర్శలు
రోస్టర్ ప్రకటించకుండా మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో స్పష్టం చేయలేదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. అలాగే సర్వీస్ రూల్స్, కోర్టు తీర్పులు పరిశీలించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 123 అర్బన్ లోకల్ బాడీల్లో 2,115 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు చివరిగా 2018లో పదోన్నతులు కల్పించారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో అమలు చేసిన విధానాలనే మున్సిపల్ స్కూళ్లలోనూ అమలు చేస్తున్నారు. అయితే ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ మాత్రం మున్సిపల్ చట్టాలకు లోబడి ఉన్నాయి. విద్యా సంబంధమైన అంశాల్లో రెండు విభాగాల స్కూళ్లల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రెండేళ్ల క్రితం విద్యా శాఖ జీవో నెంబర్ 84 జారీ చేసింది.
దీని ప్రకారం అకడమిక్, పరిపాలనా పరమైన అంశాలను పాఠశాల విద్యా శాఖకు బదలాయించారు. దీనిపై మున్సిపల్ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి విషయంలో హైకోర్టు తుది తీర్పునకు లోబడే పాఠశాల విద్యా శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం చేసే పదోన్నతుల ప్రక్రియ విద్యాశాఖ చట్టాల ప్రకారం చేస్తున్నారా? లేక మున్సిపల్ చట్టాల ప్రకారమా? అనేది తేల్చాల్సి ఉంది. అది తేల్చలేదు. మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు పాఠశాల విద్యా శాఖ ఇచ్చిన షెడ్యూల్ అభ్యంతరకరంగా ఉందని, చివరిగా ఇచ్చిన పదోన్నతతుల్లో ఏ పోస్టుకు ఏ రోస్టర్ పాయింట్ వద్ద ఆగిందో వెల్లడించలేదని రాష్ట్ర మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ అన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్