Sangareddy : తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. గంటల వ్యవధిలోనే దొంగతనాలు చేస్తున్న దుండగులు

Best Web Hosting Provider In India 2024

ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో పూజకు వెళ్లొచ్చేలోగా.. దుండగులు చోరీకి పాల్పడి 31 తులాల బంగారం, 10 తులాల వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మడిదల గ్రామానికి చెందిన చిమ్ముల రవీందర్ రెడ్డి, భార్య రజిత బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉండడంతో ఇంటికి తాళం వేసి వెళ్లారు. వ్రతం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది.

ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఆ దంపతులు ఇంట్లోకి వెళ్లి బీరువా తీసి చూడగా 31 తులాల బంగారం, 10 తులాల వెండి, నాలుగు వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదనపు ఎస్పీ సంజీవరావు, జిన్నారం సీఐ సుధీర్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సినిమాకు వెళ్లొచ్చేసరికి..

ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుటుంబంతో సినిమా చూడటానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి దొంగలు ఇల్లు గుళ్ల చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు మండలం బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీడీఎల్- భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లైఫ్ స్టైల్ డ్రీమ్ హోమ్స్ కాలనీలో నివాసముంటున్న నందారపు శరత్, సుప్రియ దంపతులు మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. శనివారం వీకెండ్ కావడంతో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లారు.

ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో షాక్ కు గురయ్యారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా పడి ఉంది. బీరువాను తెరిచి చూడగా అందులో 25 తులాల బంగారం, 10 తులాల వెండి, ఐదు వేల నగదు తో పాటు 3 ఖరీదైన చేతి గడియారాలు కనిపించలేదు. దీంతో ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బీడీఎల్ సీఐ స్వామి గౌడ్, క్లూస్ టీం తోపాటు అడిషనల్ ఎస్పీ సంజీవ రావు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కానిస్టేబుల్ ఇంట్లో..

మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నివసిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు 3 రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు అల్లాదుర్గం సీఐ రేణుక తెలిపారు. అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సిమన్ మూడు రోజుల కిందట ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దుండగులు చోరీకి పాల్పడి 8 తులాల బంగారం,20 తులాల వెండి, నగదు దోచుకెళ్లారు.

ఈ కేసులో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన కాశీరాం, వెల్లపు నిర్మల, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వడ్డే శ్రీకాంత్ కలిసి కానిస్టేబుల్ ఇంట్లో చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి బంగారం, వెండిని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.

(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

MedakSangareddyTs PoliceCrime NewsCrime TelanganaTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024