Investments in Hyderabad : హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్.. బ్లాక్ స్టోన్ భారీ పెట్టుబడులు

Best Web Hosting Provider In India 2024

Investments in Hyderabad : హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్.. బ్లాక్ స్టోన్ భారీ పెట్టుబడులు

Investments in Hyderabad : తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా బ్లాక్ స్టోన్ కంపెనీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్​‌ను తెలంగాణలో ప్రారంభించనుంది.

 
బ్లాక్ స్టోన్
బ్లాక్ స్టోన్
 

పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్‌ స్టోన్ హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బ్లాక్‌స్టోన్ లూమినా (బ్లాక్‌స్టోన్ డేటా సెంటర్ విభాగం)తో పాటు జేసీకే ఇన్‌ఫ్రా.. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

 

రూ.4,500 కోట్ల పెట్టుబడి..

ప్రతిపాదిత డేటా సెంటర్ రూ.4,500 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్‌ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ డేటా సెంటర్ అందిస్తుంది. బ్లాక్‌స్టోన్ లుమినా ప్రపంచంలోని ప్రముఖ క్లౌడ్ మౌలిక సదుపాయాల ప్రొవైడర్లలో కీలకంగా ఉంది. ఈ కంపెనీ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటంతో మిగతా విదేశీ కంపెనీలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలకు తెలంగాణ గమ్యస్థానంగా మారనుంది.

ఎక్లాట్ హెల్త్ కొత్త ఆఫీస్​..

ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ రాష్ట్రంలో మరో ఆఫీసు ఏర్పాటు చేయనుంది. దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయముండేలా దీన్ని నెలకొల్పుతుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో.. ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఎక్లాట్ కంపెనీ సీఈవో కార్తీక్ పోల్సానితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో అత్యాధునిక 800 సీట్ల సౌకర్యాన్ని ఎక్లాట్ ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 2025 నాటికి ఇది పని చేయటం ప్రారంభిస్తుంది.

 

హెల్త్ కేర్ రంగంలో అమెరికాలోనే అతి పెద్ద యునైటెడ్ వ్యవస్థ ఉన్న కంపెనీ.. తమ వినియోగదారులకు మరింత సమర్థవంతమైన సేవలను అందించేందుకు అదనంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది. రెవెన్యూ, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత క్లినికల్ డాక్యుమెంటేషన్ సొల్యూషన్స్‌లో ఈ కంపెనీ కి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఉద్యోగ అవకాశాలు..

వాషింగ్టన్, డి.సి.లో ప్రధాన కార్యాలయమున్న ఎక్లాట్ హెల్త్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 3,000 మందికి పైగా నిపుణులను నియమించింది. అమెరికాలోనే 450 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న రెండు ఆఫీసుల్లో 2,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. 2011లో ద్వితీయ శ్రేణి నగరమైన కరీంనగర్‌లో ఈ కంపెనీ పైలెట్ కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడ దాదాపు 500 మంది పని చేస్తున్నారు. ఎక్లాట్ విస్తరణతో తెలంగాణలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నైపుణ్య అభివృద్ధికి దోహదపడుతుంది.

ప్రోత్సాహకరంగా విధానాలు..

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రోత్సహకరంగా ఉన్నాయని ఎక్లాట్ హెల్త్ గ్రూప్ సీఈవో కార్తీక్ పోల్సాని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమ క్లయింట్‌లకు హెల్త్ కేర్ సేవలను అందించేందుకు రాష్ట్రంలో అన్ని అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ కంపెనీలను ఆకర్షించడంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.

Whats_app_banner
 

టాపిక్

 
HyderabadInvestmentTrending TelanganaTelangana NewsRevanth Reddy
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024