Best Web Hosting Provider In India 2024

అనంతపురం జిల్లాలో క్షీణించిన లా అండర్ ఆర్డర్
గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో పరిస్థితి
ఏమీ చేయలేని స్థితిలో కలెక్టర్, ఎస్పీ, డీఐజీ
అధికారమే ఆయుధంగా టీడీపీ నేతల తీరు
పోలీస్‌స్టేషన్లలోనూ బాధితులకు జరగని న్యాయం
ఊర్లు విడిచివెళ్లాలని పోలీసులే చెప్పడం ఏంటి?
ప్రజాప్రతినిధుల పర్మిషన్‌తో ఊర్లకు వెళ్లాలా?
అధికార పార్టీ నేతలకు పోలీసుల వత్తాసు
వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత మండిపాటు
పరిస్థితిలో మార్పురాకుంటే ప్రజాస్వామ్య పోరాటం తప్పదని హెచ్చరిక
అనంతపురం : అనంతపురం జిల్లాలో లా అండర్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ‘‘ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్లు నియోజకవర్గానికి పోతానంటే పోనీయరు.. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళితే రివర్స్ కేసులు పెడతారు.. పోలీస్‌స్టేషన్లలోనే కొడతారు.. మీడియాలో కథనాలు వస్తే రైలు పట్టాలపై పడుకోబెడతామని బహిరంగంగా వార్నింగ్ ఇస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనంత మాట్లాడుతూ ..‘‘ కూటమి అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులు ఉన్నాయి. పోలీసు, రెవెన్యూ శాఖలు నిర్వీర్యం అయ్యాయి. కలెక్టర్, ఎస్పీ, డీఐజీలు చేతగాని వాళ్లలా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్లారు. మేం నిమిత్తమాత్రులం అని వాళ్లు చెప్పకనే వారి చర్యల ద్వారా అర్థమవుతోంది. అధికారం అనే ఆయుధంతో టీడీపీ నాయకులు ముందుకెళ్తున్నారు. మేం ఏది చెప్తే అదే శాసనం అంటూ వ్యవహరిస్తున్నారు. వాళ్లను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. జిల్లా కేంద్రంలో తరచూ ఏదో ఒక ఘటన జరుగుతోంది. మేం ముందు నుంచి హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా.. చివరకు అన్నదమ్ముల ఆస్తులు భాగాలు పంచుకోవాలన్నా టీడీపీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
జిల్లాలో పరిస్థితులను గతంలో కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోతోంది. ఫలానా వ్యక్తి మేం చెబితేనే గ్రామాల్లో ఉండాలనే పరిస్థితిని టీడీపీ నాయకులు తెచ్చారు. వాళ్లు ఉండమంటే ఉండాలి.. లేదంటే లేదా? అన్యాయం జరిగి పోలీస్‌స్టేషన్లకు వెళితే కేసులు రిజిస్టర్ కావడంలేదు. ఒక వేళ చేసినా టీడీపీ నాయకులను కూడా పోలీసులే పిలిపించుకుని కౌంటర్ కేసులు పెట్టిస్తున్నారు. పోలీసులు బాధితులపై నాన్‌బెయిలబుల్ కేసులు.. టీడీపీ వాళ్లపై బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారు. డీఎస్పీ, సీఐ స్థాయి వ్యక్తులే కొద్ది రోజులు ఊరు విడిచివెళ్లాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు చెప్పే పరిస్థితి జిల్లాలో ఉంది. చివరకు అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా రైలు పట్టాలపై పడుకోబెడతామని హెచ్చరిస్తున్నారు. అయినా పోలీసులు చేతగాని దద్దమ్మల మాదిరిగా కళ్లు, చెవులు మూసుకున్నారు. జిల్లా కేంద్రంలో కానిస్టేబుళ్లే ప్రజలపై దాడులు చేస్తున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు. గుంతకల్లు మండలంలోని చింతలాంపల్లిలో ఇటీవల స్థల వివాదం జరిగింది. గతంలో దాడులు జరిగాక బాధితులు అనంతపురంలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కౌంటర్ కేసులు పడ్డాయి. రెండ్రోజుల క్రితం మళ్లీ గొడవ జరిగింది. దెబ్బలు తిని ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే అక్కడి కానిస్టేబుల్ కిశోర్, జాఫర్‌లు బాధితుడి దుస్తులు తొలగించి డ్రాయర్‌పై నిలబెట్టి ఇష్టారాజ్యంగా కొట్టారు. అతడు భయంతో పరుగుతీసి రోడ్డు మీదకు వచ్చాడు. ఆ తర్వాత వైసీపీ నాయకులు వెళ్లి మాట్లాడితే వారిపై కూడా దుర్భాషలాడారు.
ఇంత జరుగుతుంటే ఎస్పీ, డీఐజీ ఏం చేస్తున్నారు? పోలీసులకు మీరు బాస్‌లా? లేక ఆ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులా? పోలీసులకు అధికార పార్టీ నేతలపై అంత మోజుంటే ఖాకీ బట్టలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకోండి. ఐపీఎస్‌లు చట్టానికి అనుగుణంగా పని చేయండి. అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తుంటే మీరు విననట్టు.. మీ నోళ్లు మూగబోయినట్లు.. మీ చేతులు కట్టేసినట్లు ఎందుకున్నారు? ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే కథ చూస్తామని అందరిలా చెప్పలేను. అధికారం ఉన్నా, లేకపోయినా అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. రాజ్యాంగ రక్షణ ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం.
శాంతిభద్రతల విషయంలో పరిస్థితి ఇలాగే ఉంటే మీ కార్యాలయాల వద్దకే వచ్చి మీ బాధ్యతను గుర్తు చేస్తాం’’ అని అనంత స్పష్టం చేశారు. సమావేశంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, నాగన్న, వైయస్ఆర్‌సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు రమేష్ గౌడ్, వైయస్ఆర్‌సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, సాకే చంద్రశేఖర్, ఎద్దుల అమర్నాథ్‌రెడ్డి, ఓబిరెడ్డి, సైఫుల్లా బేగ్, నరసింహులు, చంద్రశేఖర్ యాదవ్ పాల్గొన్నారు.