




Best Web Hosting Provider In India 2024

AP DGP Harish Gupta: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియామకం.. ముందే చెప్పిన హెచ్‌టి తెలుగు
AP New DGP: ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు నెలాఖర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేశారు. హరీష్ గుప్తా నియామకాన్ని జనవరి 17న హెచ్‌టి తెలుగు వెల్లడించింది.
AP New DGP: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త డీజీపీ ఎంపికను రెండు వారాల క్రితమే ఖరారు చేశారు. జనవరి నెలాఖర్లో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారిన నేపథ్యంలో డీజీపీగా హరీష్ గుప్తాను ఎంపిక చేస్తారని జనవరి 17న హెచ్‌టి తెలుగు వెల్లడించింది. ప్రస్తుత డీజీపీని కొనసాగించడంపై యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన పంపకపోవడంతో కొత్త డీజీపీ ఎంపిక అనివార్యమైంది. బుధవారం రాత్రి చీఫ్ సెక్రటరీ విజయానంద్ జీవోను విడుదల చేశారు.

ఏపీ డీజీపీ రేసులో మాజీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజేతగా నిలిచారు. తీవ్ర పోటీ ఎదురైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనవైపు మొగ్గు చూపారు. కేంద్ర ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను గత మేలో డీజీపీగా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాట్లలో పోలీసులు విఫలం కావడం, గత ఏడాది జూన్ 12న నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం వివాదాస్పదమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విఐపిలు కూడా సకాలంలో చేరుకోలేకపోయారు. ఆ తర్వాత అనూహ్యంగా జూన్ 21వ తేదీన డీజీపీగా ద్వారకా తిరుమలరావును రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ద్వారకా తిరుమల రావు పదవీ కాలం జనవరి 31తో ముగియనుండటంతో ఆయన్ని మరికొంత కాలం పొడిగిస్తారా లేదా అనే దానిపై అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత కొత్త డీజీపీ ఎంపికపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు అప్పట్లో వెల్లడించాయి.
ద్వారకా తిరుమల రావు తర్వాత సీనియార్టీలో మొదటి స్థానంలో ఉన్నఅంజనీ కుమార్ ఏపీ క్యాడర్‌కు రాలేదు. ఆయన తర్వాత ఉన్న హరీష్ కుమార్ గుప్తా 2025 ఆగస్టులో పదవీ విరమణ చేస్తారు. ద్వారకా తిరుమలరావు పదవీ కాలాన్ని పొడిగిస్తే హరీష్‌కుమార్‌కు డీజీపీ అవకాశం దక్కదు. ద్వారకా తిరుమల రావు స్థానంలో సీనియార్టీ ప్రాతిపదికన హరీష్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు.
గత ఏడాది మే6వ తేదీన హరీశ్ కుమార్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీగా ఎంపిక చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించాలని గత మేలో సీఎస్ కు జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. మే 5న ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.
రాజకీయ ఆరోపణల నేపథ్యంలో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో హరీష్‌ను ఎంపిక చేసింది. సీనియార్టీలో ద్వారకా తిరుమల రావు, హరీశ్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ ల పేర్లను అప్పట్లో ఏపీ సీఎస్ ఈసీకి సూచించారు. వీరిలో సీనియర్ ఐపీఎస్, 1992 బ్యాచ్ కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా పేరును ఈసీ డీజీపీగా ఎంపిక చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన హరీష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యారు. తాజాగా రెండోసారి హరీష్ గుప్తా డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
సీనియార్టీలో హరీష్ తర్వాత స్థానాల్లో సీతారామాంజనేయులు, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత 93 బ్యాచ్‌కు చెందిన నళినీ ప్రభాత్, మహేష్ దీక్షిత్‌లు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అమిత్ గార్గ్ సర్దార్ వల్లభాయ్‌పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నారు. 94 బ్యాచ్‌లో పీవీ సునీల్, కుమార్ విశ్వజిత్, రవిశంకర్ అయ్యన్నార్, బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. హరీష్ కుమార్ తర్వాత డీజీపీ రేసులో బాలసుబ్రహ్మణ్యం, రవిశంకర్ అయ్యన్నార్, కుమార్ విశ్వజిత్ లు ఉంటారు.
సంబంధిత కథనం
టాపిక్