




Best Web Hosting Provider In India 2024

Karimnagar Crime : తల్లి దారుణ హత్య, నాలుగేళ్ల కుమారుడు అదృశ్యం..! అసలేం జరిగింది..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మమత అనే మహిళ కరీంనగర్ లో హత్యకు గురైంది. అయితే ఆమెతో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు అదృశ్యమయ్యాడు. ఈ కేసులో ఓ కారు ఆచూకీ లభింనప్పటికీ నిందితులు దొరకలేదు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
‘ప్రేమించుకున్నారు… పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. ప్రేమ పెళ్ళికి గుర్తుగా ఓ బాబుకు జన్మనిచ్చారు. సజావుగా సాగిన కాపురంలో ఏమైందో ఏమో? ఆమె భర్తకు దూరంగా జీవనం సాగింది. బాబుతో శనివారం మంచిర్యాల నుంచి కారులో బయలుదేరిన ఆ మహిళ కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి వద్ద దారుణ హత్యకు గురైంది. ఆమె వెంట ఉన్న నాలుగేళ్ల కొడుకు అదృశ్యం అయ్యాడు. ఆచూకీ లేక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మహిళను హత్య చేసింది ఎవరు?… నాలుగేళ్ళ బాబు ఏమయ్యాడనేది…ఇప్పుడు మిస్టరీగా మారింది.

ప్రేమ పెళ్లి…
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన నర్సింగ్ స్టూడెంట్ మమత… మంచిర్యాల జిల్లా కాసింపేట చెందిన అంబులెన్స్ డ్రైవర్ భరత్ లు ప్రేమించుకున్నారు. ఆరేళ్ళుగా ప్రేమాయణం సాగించి పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ధ్రువ అనే బాబు జన్మించాడు. అన్యోన్యంగా సాగిన దాంపత్య జీవితం కలతలు మొదలయ్యాయి. గత దసరా పండుగ నుంచి భర్త భరత్ కు దూరంగా ఉంటుంది. కొడుకుతో కలిసి మంచిర్యాలలో ఉండే బంధువుల వద్ద ఉంటు జీవనం సాగిస్తుంది.
బాబుతో కలిసి కారులో బయలుదేరి…
ఐదు రోజుల క్రితం షాప్ కు వెళ్తున్నానని చెప్పి బాబుతో కలిసి కారులో ఎక్కి బయలుదేరింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎవరు తీసుకువెళ్లారనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ కారులో బయలుదేరిన విజువల్స్ సిసి కెమెరా లో రికార్డు అయింది. జిల్లా సరిహద్దులు దాటి ప్రయాణించారు. చివరకు కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి వద్ద ఎస్సారెస్పీ వరద కాలువ సమీపంలో రోడ్డు పక్కన శవమై తెలింది.
ముఖంపై గాయాలు మెడకు ఉరేసిన ఆనవాళ్ళు ఉండడంతో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని గుర్తించేందుకు ప్రచారం చేశారు. అప్పటికే మంచిర్యాలలో ఇంటి నుంచి బయలుదేరిన మమత ఆచూకీ దొరకకపోవడంతో అదృశ్యమైనట్టు పోలీసులను కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కొండన్నపల్లి వద్ద ఉన్న మహిళా మృతదేహాన్ని చూసి మమతగా గుర్తించారు. మరి ఆమె వెంట వెళ్లిన కొడుకు ధ్రువ ఆచూకీ లేదు. మమతను ఎవరు హత్య చేశారు.. నాలుగేళ్ల బాబు ఏమయ్యాడో మిస్టరీగా మారింది.
మమతా హత్యపై భర్త స్పందించాడు. మమతా మిసైనట్లు బామ్మార్ది ఫోన్ చేశాడని… తనను ఆట పట్టించడానికే ఫోన్ చేసినట్లు భావించానే తప్ప ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ఎవరి మీద అనుమానం లేదంటున్నాడు. తన కొడుకు ఆచూకీ చెప్పి న్యాయం చేయాలని కోరుతున్నాడు.
వీడని బాబు అదృశ్యం మిస్టరీ…
మమత హత్యకు గురి కాక అదృశ్యమైన ఆమె కుమారుడు ద్రువ ఆచూకీ లభించలేదు. కానీ వారు మంచిర్యాల నుంచి బయలుదేరిన కారును పోలీసులు గుర్తించారు. ఆ కారు మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. ఆ కారును సెల్ప్ డ్రైవింగ్ కోసం ఓ డ్రైవర్ తీసుకెళ్ళినట్లు కారు ఓనర్ తెలిపారు.
కారును అద్దెకు తీసుకున్న డ్రైవర్… కారును సికింద్రాబాద్ లో వదిలేసి పారిపోయాడు. అతని కోసం పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. డ్రైవర్ దొరికితే గానీ బాబు ఆచూకీ లబించే పరిస్థితి లేదు. అసలు బాబు సేఫ్ గా ఉన్నాడా? లేక ఎమైనా చేశాడా? అనేది తెలియక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మహిళ మమత హత్య, బాబు అదృశ్యం కేసు కరీంనగర్, రామగుండం రెండు కమిషనరేట్ పోలీసులకు సవాల్ గా మారింది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని వారే అయినప్పటికీ మహిళా మృతదేహం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో దొరకడంతో రెండు కమిషనరేట్ ల పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు.
మహిళా హత్యకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. బాబు అదృశ్యం మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. కారును గుర్తించిన పోలీసులు మమత హత్య, బాబు అదృశ్యం వెనుక ఉన్న వారు ఎవరో తేల్చే పనిలో రెండు కమిషనరేట్ల పోలీసులు ఉన్నారు. బాబు సేఫ్ గా ఉండాలని, ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్