



Best Web Hosting Provider In India 2024
TTD Council Meeting : శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు.. ఈ దర్శనాలు రద్దు!
TTD Council Meeting : తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. రథసప్తమి కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. అటు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీపైనా కీలక నిర్ణయం తీసుకుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ అనతరం బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. రథసప్తమికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏడు వాహనాలపై రథసప్తమి నాడు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని వివరించారు. 2 నుండి 3 లక్షల మంది భక్తులు ఆరోజు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.

ఈ దర్శనాలు రద్దు..
‘రద్దీని దృష్టిలో ఉంచుకొని రథసప్తమి నాడు అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నాం. ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో ఎస్ఎస్‌డీ టోకన్లు జారీని నిలిపివేస్తున్నాం. 1250 మంది పోలీసులతో రథసప్తమికి భద్రత కల్పిస్తాం. భక్తుల మధ్య తోపులాటకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నాం. ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళాలు పనిచేస్తాయి’ అని బీఆర్ నాయుడు వివరించారు.
8 లక్షల లడ్డూలు..
‘వాహనసేవలను తిలకించేందుకు, గ్యాలరీల్లో వేచిఉండే భక్తులకు నిర్విరామంగా అన్నపానీయాలు పంపిణీ చేస్తాం. పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలతో తిరుమలను ముస్తాబు చేస్తాం. 8 లక్షల లడ్డూలు నిల్వ చేస్తున్నాం. తిరుపతిలో జనవరి 8న జరిగిన దురదృష్ట ఘటనను దృష్టిలో పెట్టుకొని.. రథసప్తమి నాడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం’ అని నాయుడు స్పష్టం చేశారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు..
‘తొందరపాటు నిర్ణయాలు తీసుకొకుండా.. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలని అధికారులను అదేశించాం. మహా కుంభామేళా ప్రయాగ్ రాజ్‌లో టీటీడీ నమూనా ఆలయం అద్భుతంగా ఉంది. రోజుకు 10 వేల మంది భక్తులకు దర్శించుకుంటున్నారు. తిరుమల తరహాలో అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నాం’ అని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.
వాహన సేవల వివరాలు..
ఉదయం 5.30 – 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44) – సూర్య ప్రభ వాహనం
ఉదయం 9 – 10 గంటల వరకు – చిన్న శేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
టాపిక్