



Best Web Hosting Provider In India 2024
KCR Comments : నేను కొడితే మామూలుగా ఉండదు.. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఊర మాస్ స్పీచ్
KCR Comments : ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఎట్టకేలకు నోరువిప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు కాలు దువ్వారు. ఫిబ్రవరి నెలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. తాను కొడితే మామూలుగా ఉండబోదని ఆయన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ స్పీచ్‌తో గులాబీ సైన్యంలో జోష్ వచ్చింది.
ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. కొడితే మామూలుగా ఉండదు.. అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక లాభం లేదు.. ప్రత్యక్షపోరాటం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ఇక తగ్గేదేలే..
‘కాంగ్రెస్ వాడు పోలింగ్ పెడితే 70 శాతం మనకే అనుకూలంగా ఓట్లు వేశారు. 30 శాతం వాడికి వేశారు. ఇక లాభం లేదు, ప్రత్యక్షపోరాటం చేయాల్సిందే. నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం చెప్పారు. తులం బంగారం అన్నాడు, వడ్డానం అన్నాడు.. నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి. కరోనా టైంలో కూడా నేను రైతుబంధు ఆపలేదు. రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు జరిగింది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పెద్దపాము మింగినట్లైంది..
‘కైలాసంలో పెద్దపాము మింగినట్లైంది తెలంగాణ పరిస్థితి. ఇదో మంచి గుణపాఠం. కొందరు అత్యాశకు పోయి చెప్పుడు మాటలు విని మోసపోయారు. రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. మన హయాంలో ఆదాయం ఏటా పెరిగితే.. ఇప్పుడు పడిపోయింది. రూ.13 వేల కోట్ల ఆదాయం పడిపోయిందని కాగ్ నివేదిక చెబుతోంది. పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి. భూముల ధరలు పడిపోయాయి’ అని కేసీఆర్ వివరించారు.
ఎండాకాలం ఏం గతి అయితదో..
‘పాత కాంగ్రెస్ మళ్లీ మోపైంది. కరెంటు కోతలు మొదలయ్యాయి. ఎండాకాలం ఏం గతి అయితదో తెలుస్తలేదు. మంచినీళ్లు సరిగ్గా వస్తలేవు. అడిగితే కేసులు పెడుతున్నారు. తెలంగాణ బాగు కోసం మళ్లీ మనమే కొట్లాడుదాం. ప్రాణం పోయినా సరే.. తెలంగాణ కోసం కొట్లాడుదాం. ఇందులో రెండో మాట లేదు. రాజ్యం అంటే ఇలానే ఉంటుందా? ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగసభ పెట్టి ప్రభుత్వాన్ని ఎండగడదాం. అందరూ భారీఎత్తున తరలిరావాలి’ అని కేసీఆర్ కోరారు.
జనాలు కొట్టేలా ఉన్నారు..
‘నేను ఎన్నో ప్రభుత్వాలను చూశాను. కానీ ఇలాంటి పాలనను ఎప్పుడూ చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎడాదిలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ లీడర్లు కనిపిస్తే.. జనాలు కొట్టేలా ఉన్నారు. తెలంగాణ శక్తి ఏమిటో చూపించి కాంగ్రెస్ మెడలు వంచుదాం. ఫాం హౌస్… ఫాం హౌస్ అని అంటున్నారు. ఇక్కడ అల్లం, ఉల్లిపాయ తప్ప ఏమున్నాయి? కాంగ్రెస్ వాళ్లు ఇక్కడకు వస్తే తలో పార ఇచ్చి తవ్వుకోమందాం. ఇంకోసారి నోరు మెదపరు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ధైర్యంగా కొట్లాడండి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
టాపిక్