’బాబు’ ష్యూరిటీ… ప్రజలపై బాదుడు గ్యారెంటీ

Best Web Hosting Provider In India 2024

రిజిస్ట్రేషన్‌ ఛార్జీల పేరుతో ఏటా రూ.13000 కోట్లు భారం

తన బినామీలకు మేలు చేసేందుకే అమరావతి భూములకు సీఎం మినహాయింపు

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్‌

చంద్రబాబు పాలన అంటేనే ప్రజలపై వడ్డింపులు

దావోస్‌ లో ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ ను దెబ్బ తీశారు

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ప్రచారం చేశారు

రెడ్‌ బుక్‌ తో పారిశ్రామికవేత్తలను భయపెట్టారు

జగన్‌గారి పాలన సింప్లిసిటీ అయితే చంద్రబాబు పాలన పబ్లిసిటీ 

రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం నడుస్తోంది

మాజీ మత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం

కాకినాడ బియ్యం నివేదికను రాజకీయం చేస్తున్నారు

తప్పుడు నివేదిక ఇవ్వాలని ఐపీఎస్‌ అధికారిపై ఒత్తిళ్ళు సిగ్గుచేటు

తప్పుడు నివేదికను నిరాకరించిన ఐపీఎస్‌ అధికారిని సెలవుపై పంపించారు

రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ ప్రకారమే అధికారులు పని చేయాలంటూ వేధిస్తున్నారు

రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పింది

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపణ

వైయస్‌ఆర్‌ సీపీ హయాంలోనే ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడింది

కేంద్ర నివేదికలను కూడా వక్రీకరించేందుకు తెగబడ్డారు

‘అసర్‌’ నివేదిక అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.

విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఉద్యమించే పరిస్థితి తెచ్చారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగిస్తున్నారు

ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వ తీరును ఎండగట్టిన కన్నబాబు

కాకినాడ:    సంపద సృష్టి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రజలపై పెను భారాలను మోపడమేనని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచడం ద్వారా ప్రజల నుంచి ఏటా రూ.13000 కోట్లు ముక్కుపిండి వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మాత్రం తన బినామీలపై భారం పడకూడదని రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపును మినహాయించారని ఆరోపించారు.

ప్రెస్‌మీట్‌లో కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..
    రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచుతున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అమలు చేయడం అని చంద్రబాబు అనుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదేనా? ఒక వస్తువుకు ఎలా మార్కెటింగ్‌ చేస్తారో అలాగే తనను తాను మార్కెటింగ్‌ చేసుకునేలా సంపద సృష్టి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దానిని నమ్మిన ప్రజలు ఈ రోజు అవస్థలకు గురవుతున్నారు. స్థిరాస్థి విలువలను అడ్డగోలుగా పెంచడం, భూములు, నిర్మాణాలు, చివరికి తాత్కలిక నివాసం ఉండే షెడ్లు, పూరిళ్ళను కూడా ఈ చార్జీల పెంపు కిందకు తీసుకువచ్చారు. రాష్ట్రంలో చంద్రబాబుకు తనకు కావాల్సిన వారికి అనుకూలంగా ఈ రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచారు. చంద్రబాబు, ఆయన బినామీల చేతుల్లో అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు వున్నాయి. ఈ చార్జీల పెంపుదల నుంచి వీటికి మినహాయింపు కల్పించారు. రాష్ట్రమంతా పెంచిన చార్జీలు ఇక్కడ మాత్రం పెరగవు. అంటే తన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మినహాయింపులు కల్పించారు. అమరావతిలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచితే, కొనుగోళ్ళు ఇబ్బంది కలుగుతాయని అక్కడ మార్కెటింగ్‌ పెరిగేందుకు వీలుగా, భూములను అమ్ముకుని తన బినామీలు లాభం పొందేందుకు వీలుగా రిజిస్ట్రేషన్‌ చార్జీల పెంపుదల నుంచి మినహాయింపు ఇచ్చారు. చాలా చిత్రంగా లేయర్లు, గ్రిడ్స్‌ పేరుతో తమకు అనుకూలమైన ప్రాంతంలో చార్జీలను పెంచడం, మినహాయించడం పై నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక అపార్ట్‌ మెంట్‌ కొనుగోలుచేస్తే లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్‌ చార్జీలును చెల్లించాల్సిన పరిస్థితిని కల్పించారు.

అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని దివాలా తీయించారు:
    గత ఎనిమిది నెలల పాలన చూస్తూ చంద్రబాబు అసమర్థత, వైఫల్యం కనిపిస్తోంది. నీతిఅయోగ్‌ పై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా దివాలా తీసింది, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ మాట్లాడారు. అభివృద్ది ద్వారా సంపద సృష్టిస్తాం, దానితో సంక్షేమం చేస్తానంటూ ఒక కొత్త వాదనను వినిపించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ’పూర్‌ టు రిచ్‌’ అనే ఒక నినాదం ఇచ్చారు. పేదలన కుబేరులను చేస్తానంటూ మభ్యపెట్టారు. సూపర్‌ సిక్స్‌ ఏమయ్యాయి? వాగ్దానాల అమలు ఏదీ అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అధికారాన్ని వినియోగించుకుని కేసులు నమోదు చేస్తున్నారు. చివరికి సోషల్‌ మీడియా యాక్టివీస్ట్‌ లపైన కూడా కేసులు నమోదు చేసి తమ నిరంకుశత్వాన్ని చాటుకుంటున్నారు. ఎన్నికలకు మందు మూలనున్న ముసలమ్మ కూడా బటన్‌ నొక్కగలదు అంటూ గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు బటన్‌ నొక్కలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ గారు చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిజంగా అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.65  లక్షల కోట్లు అవసరం అవుతాయని. మేం అమలు చేస్తున్న పథకాలకే ఏడాదికి రూ.70వేల కోట్లు ఖర్చు అవుతోంది, ఇంతకు మించి ఇచ్చే సామర్థ్యం ఈ రాష్ట్ర ఖజానాకు లేదు అని చాలా క్లియర్‌ గా వాస్తవాలను వెల్లడించారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పి, తరువాత ప్రజలను మోసం చేయలేను అని కూడా చెప్పారు. కానీ ప్రజలు దీనిని అర్థం చేసుకోలేదు. నిజం కంటే అబద్దం అందంగా కనిపించింది. చంద్రబాబు అబద్దాలను నమ్మారు. నడిచి వచ్చే అబద్దంగా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. 

8 నెలల్లో తెచ్చిన అప్పులను ఎలా ఖర్చు చేశారు?
    అమిత్‌ షా ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏపీకి రూ.3 లక్షల కోట్లు కేంద్రం ద్వారా సాయం అందించామని ప్రకటించారు. చంద్రబాబు ఇప్పటివరకు రూ.1.19 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు. అంటే ఈ ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి అందిన నిధులు మొత్తం రూ.4.19 లక్షల కోట్లు. నెలకు దాదాపు రూ.50 వేల కోట్లు. ఈ నిధులు ఏం చేశారు? ఏ పథకం కింద ప్రజలకు ఎంత సొమ్ము అందించారు? వీటికి సంబంధించిన లెక్కలు వెల్లడించండి. ఆర్థిక అరాచకత్వం ఈ రాష్ట్రంలో నడుస్తోంది. ఒకవైపు అభివద్ధి లేదు, మరోవైపు సంక్షేమం కనిపించడం లేదు. నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నారు. చివరికి జగన్‌ గారు సీఎంగా ఉండగా వాట్సాప్‌ లో గవర్నెన్స్‌ ను తీసుకువచ్చారు. పదిహేను రోజుల కాలంలో కోటి సర్టిఫికేట్‌ లను ఇంటింటికీ తీసుకువెళ్ళి అందించారు. దానిని కాపీ చేసి నేడు లోకేష్‌ వాట్సప్‌ గవర్నెన్స్‌ ను తానే కనిపెట్టినట్లు, ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. జగన్‌ గారి పాలన సింప్లిసిటీ అయితే చంద్రబాబు పాలన పబ్లిసిటీ.  2022లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం శ్రీలంక అవుతోంది, అప్పుల ఊబిలోకి వెడుతోందంటూ గుండెలు బాదుకున్నారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్‌ మాట్లాడుతూ మేం ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని అడగాలని అన్నారు. ఇప్పుడు హామీలను అమలు చేయడం కుదరదంటున్న మీ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఏం చేయాలి? ఏం చేస్తే హామీలను అమలు చేయడానికి సిద్దమవుతారు? 

కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలను వెల్లడించాలి:
    జగన్‌ గారి పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం నా ప్రాధాన్యతలు అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలు ఏమిటీ? ఏ రంగాన్ని తమ ప్రయారిటీలో పెట్టారో వెల్లడించాలి. దావోస్‌ వెళ్ళడమే అద్భుతమైన ఘట్టంగా ప్రచారం చేసుకున్నారు. ఒక్క ఎంఓయు చేసుకోకుండా రాష్ట్రానికి తిరిగి వచ్చి, దావోస్‌ లో ఎంఓయులు గొప్పకాదు అంటూ మాట మార్చేశారు. జగన్‌ గారు ఆర్థిక విధ్వంసం సష్టించారు, అప్పుల పాలు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. పారిశ్రామికవేత్తలు రావాలంటే జగన్‌ గారు మళ్లీ అధికారంలోకి రారు అని రాసివ్వమని అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కేసులతో భయపెట్టి పారిపోయేలా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు ఏ ధైర్యంతో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు? ప్రతి సందర్భంలోనూ వైయస్‌ జగన్‌ గారి ఇమేజ్‌ ను దెబ్బతీస్తున్నామనే భ్రమతో చంద్రబాబు, లోకేష్‌ లు చేసిన వ్యాఖ్యల వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్‌ బ్రాండింగ్‌ దెబ్బతిన్నది. తమ రాజకీయం కోసం ఏపీ ఇమేజ్‌ ను దెబ్బతీయడం వల్ల కొత్త పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా పరిశ్రమ పెడదామని భూముల కోసం సర్వే చేస్తుంటేనే గద్దాల వారిపై పడి వేధిస్తున్నారు.
లోకేష్‌ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ రెడ్‌ బుక్‌ ను అమలు చేస్తామని చెప్పారు. దావోస్‌ కు వెళ్ళి వేధింపులు కొనసాగిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు మా చేతుల్లో ఉన్నాయని చెబుతుంటే, ఐఎఎస్, ఐపీఎస్‌ లపై తప్పుడు కేసులు పెట్టి పాలనను దిగాజారుస్తుంటే ఏ నమ్మకంతో పెట్టుబడులు పెడతారు? 

కాకినాడ బియ్యం నివేదికపైనా ఒత్తిళ్ళు సిగ్గుచేటు:
    కాకినాడ పోర్ట్‌లో బియ్యం మాఫియాకు సంబంధించి వాస్తవంగా ఉన్న పరిస్థితికి భిన్నంగా తాము చెప్పిన వారి పేర్లను ఇరికించి, వారికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలని ఒక ఐపీఎస్‌ అధికారిని బెదరించిన ఘటనపై పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇటువంటి తప్పుడు పనులు చేయను, అవసరమైతే రాజీనామా చేస్తానంటూ సదరు ఐపీఎస్‌ అధికారి తెగించి చెప్పడంతో ఆయనతో సెలవు పెట్టించారు. ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికే ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇక మిగిలిన అధికారులు ఎలా నిస్పక్షపాతంగా పనిచేయగలరు? ఐఎఎస్, ఐపీఎస్‌ లు తమ ఉద్యోగాలనే వదులుకునే స్థాయిలో వారితో తప్పులు చేయించాలనే విధంగా పాలన సాగుతోంది. రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనేందుకు ఇంతకంటే నిదర్శనం కావాలా? ఈ రాష్ట్రంలో లోకేష్‌ రాసుకున్న రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రజలు జీవించాలని, అధికార యంత్రాంగం పనిచేయాలని నిర్ధేశిస్తున్నారు.  

చంద్రబాబుకు ఉపయోగపడే వాటికే ప్రాధాన్యత
    చంద్రబాబుకు తన బినామీల ప్రయోజనాల కోసం అమరావతి, తన సంపాధనకు ఏటీఎంగా ఉన్న పోలవరం, స్పెషల్‌ ప్యాకేజీ కోసం విశాఖ ఉక్కు. ఇవే చంద్రబాబు ప్రాధన్యతలు. కర్నూలులో హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు చేసినట్లు పత్రికల్లో చూశాం. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆనాడు సీఎంగా వైయస్‌ జగన్‌ గారు చెబితే జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ వల్ల ఏం వస్తుందీ, నాలుగు జిరాక్స్‌ షాప్‌ వస్తుందని చంద్రబాబు ఎద్దేవా చేశాడు. మరి ఈరోజు హైకోర్ట్‌ బెంచ్‌ పెడితే ఏం వస్తుందో చంద్రబాబు చెప్పాలి? జగన్‌ గారు చేస్తే అది తప్పు, చంద్రబాబు చేస్తే చాలా గొప్ప కార్యక్రమం. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపేస్తున్నారంటే దానికి మంత్రి నారా లోకేష్‌ ప్రయత్నాలే కారణం అంటూ కేంద్రమంత్రి కుమారస్వామితో మాట్లాడించడం చూస్తుంటే వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్‌ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నారా లోకేష్‌ ను జాకీలు పెట్టి మరీ పైకి లేపుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించారంటే దీనిపై ఎవరూ నోరు విప్పరు.

విద్యా వ్యవస్థ నివేదికలను వక్రీకరిస్తున్నారు:
    ఈ రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడిందీ అంటే దానికి కారణం వైయస్‌ జగన్‌ గారు. కానీ మొన్న అసర్‌ నివేదికలో జగన్‌ గారి హయాంలో విద్యారంగ స్థాయి పడిపోయిందంటూ ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరి హాయాంలో ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడ్డాయో తేల్చుకునేందుకు ఏ గ్రామానికైనా వెళ్ళి పరిశీలించేందుకు సిద్దం. జగన్‌ గారు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని సమూలంగా మారుస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. 2023 డిసెంబర్‌ 1వ తేదీన కేంద్రం ఇచ్చిన నివేదికలో స్వచ్చా విద్యాలయం ఇనిషియేటీవ్‌ కింద ఏపీలో ప్రతి పాఠశాలకు రక్షిత మంచినీటి వసతిని కల్పించారని చాలా స్పష్టంగా చెప్పింది. 49,293 టాయిలెట్లను నిర్మించినట్లు పేర్కొంది. దీనిలో బాలురకు 83.55శాతం, బాలికలకు  96.9 శాతం ఉన్నాయని రిపోర్ట్‌ ఇచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఈ నివేదిక తప్పేనని చెబుతారా? వైయస్‌ జగన్‌ గారి ప్రభుత్వం జరిగిన ప్రగతిపై కేంద్ర నివేదికలను కూడా వక్రీకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో జరిగిన మంచిని కూడా అంగీకరించ లేకపోతున్నారు. రాష్ట్రంలో పెన్షన్లు కూడా భారీ ఎత్తున తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ బకాయిలు రూ.3900 కోట్లు చెల్లించకుండా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కురసాల కన్నబాబు ఆక్షేపించారు.

Best Web Hosting Provider In India 2024