Food With No Expiry Date: మీ వంటింట్లో ఉన్న ఈ 5 పదార్థాలు ఏళ్లు గడిచినా పాడవవు! అనవసరంగా వీటిని పారేయకండి!

Best Web Hosting Provider In India 2024

Food With No Expiry Date: మీ వంటింట్లో ఉన్న ఈ 5 పదార్థాలు ఏళ్లు గడిచినా పాడవవు! అనవసరంగా వీటిని పారేయకండి!

Ramya Sri Marka HT Telugu
Jan 31, 2025 08:30 PM IST

Food With No Expiry Date: మార్కెట్లో దొరికే ప్రతి వస్తువుకి ఎక్సపయిరీ డేట్ అనేది కచ్చితంగా ఉంటుంది. కానీ, కొన్నింటికి, వంటింటిల్లో ఉండే కొన్ని ఆహారపదార్థాలకు అసలు గడువు తేదీనే ఉండదట. ఎప్పటికీ పాడవని, ఎన్ని రోజుల తర్వాత వాడినా ఒకేలా అనిపించే ఆ ఆహారపదార్థాలేంటో తెలుసుకుందామా మరి!

మీ వంటింట్లో ఉన్న ఈ 5 పదార్థాలు ఏళ్ల గడిచినా పాడవవు!
మీ వంటింట్లో ఉన్న ఈ 5 పదార్థాలు ఏళ్ల గడిచినా పాడవవు! (Shutterstock)

సాధారణంగా మనం ఏదైనా ఆహార పదార్థాన్ని కొనాలంటే ముందుగా దాని గడువు తేదీని చూస్తాం. కొద్ది వారాల పాటు ఎక్స్‌పైరీ కాదని తెలిస్తేనే కొని ఇంటికి తెచ్చుకుంటాం. అలాంటిది అసలు గడువు తేదీతో సంబంధం లేకుండా ఎన్ని రోజులపాటైనా ఒకేలా ఉండే వంటింట్లో వస్తువులేంటో తెలుసా..? సంవత్సరాల తరబడి వినియోగించుకోదగ్గ వస్తువుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎక్కువ రోజులు ఉంటే పాడవుతాయనే అపోహ నుంచి బయటపడదాం.

yearly horoscope entry point

1. సంవత్సరాల తరబడి పాడని చక్కెర

చక్కెర ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ఫలితాల గురించి అటుంచితే, ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువు చక్కెర. చాలా మంది ఇంట్లో చక్కెర చాలా కాలం పాటు ఉంటే, గడ్డ కడుతుందనో, పాడైపోతుందనో అపోహ పడుతుంటారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉంచినా కూడా పాడవదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. చక్కెర తీసుకునే ప్రతి సమయంలోనూ పొడి స్పూన్ మాత్రమే వినియోగించాలి. మరే ఇతర కారణంతో కూడా నీరు లేదా తేమ అనేది పాత్రలోకి వెళ్లకుండా చూడాలి. ఈ విధంగా ఉంచితే ఎన్ని సంవత్సరాల వరకైనా చక్కెరను యథావిధిగా ఉంచుకోవచ్చు.

2. దీర్ఘకాలం పాటు నిల్వ చేయగల బియ్యం

భారతీయులు అందులో దక్షిణాది వాసులు తీసుకునే ఆహారానికి బియ్యం చాలా అవసరం. మన జీవితాల్లో ముఖ్య భాగమైపోయిన బియ్యాన్ని చాలా మంది ఇళ్లలోనే నిల్వ చేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి దీనికి గడువు తేదీ అనేది ఉండదు. దీనిని దీర్ఘకాలం పాటు వినియోగించుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా గాలి చొరబడని పాత్రలో నిల్వ చేయడం ఉత్తమం. రోజువారీ ఉపయోగం కోసం, కొంత బియ్యాన్ని తీసుకుని చిన్న పాత్రల్లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెద్ద పాత్రను పదేపదే తెరవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా తేమ ప్రవేశించే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

3. పాడవని సోయా సాస్

ఎప్పటికీ పాడవని ఇంకొక వస్తువు సోయాసాస్. చాలా చైనీస్ వంటకాల్లో ఉపయోగించే ఈ పదార్థం సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుంది. దీనిలో చాలా ఎక్కువ మోతాదులో సోడియం ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలం వినియోగించుకోవచ్చు. అయితే, దీన్ని ఎల్లప్పుడూ గాజు సీసాలో మాత్రమే నిల్వ చేసి, చల్లని, తక్కువ కాంతి పడే ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. మీరు సోయా సాస్ సీసాను తెరిచి ఉంచినట్లయితే, దాన్ని రెండు నుండి మూడు సంవత్సరాల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు కూడా.

4. దీర్ఘకాలం ఉపయోగించుకోదగ్గ ఉప్పు

చాలా వంటకాల్లో ఉప్పు తరచుగా వినియోగిస్తారు. ఉప్పుకు కూడా గడువు తేదీ అనేది ఉండదు. మీరు దీర్ఘకాలం గాలి చొరబడని పాత్రలో నిల్వ చేయవచ్చు. ఉప్పు సహజ సంరక్షణకారి, అంటే ఇది ఇతర పదార్థాలను కూడా సంరక్షిస్తుంది. ఉదాహరణకు, ఉప్పు సరిపడా ఉన్న పచ్చళ్లు దీర్ఘకాలం సురక్షితంగా ఉంటాయి. కాబట్టి, దీన్ని కొన్ని దశాబ్దాల పాటు ఉపయోగించవచ్చు కూడా. అయితే, అయోడిన్, ఫోర్టిఫైడ్ ఉప్పు సాధారణ ఉప్పు కంటే త్వరగా పాడవచ్చు.

5. వెనిగర్‌కు నో ఎక్సపయిరీ

పచ్చళ్లతో పాటు అనేక రుచికరమైన వంటకాల్లో ఉపయోగించే వెనిగర్ కూడా ఎప్పటికీ పాడవదు. ఉప్పులాగే, వెనిగర్ కూడా ఆహార పదార్థాలను దీర్ఘకాలం సంరక్షించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఈ పదార్థానికి పాడయ్యే ప్రశ్నే ఉండదు. వెనిగర్‌లో అనేక రకాలు ఉన్నాయి. వీటన్నింటినీ వినియోగించే సమయంలో గడువు తేదీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల తరబడి ఉపయోగించవచ్చు. వీటిని నిల్వ చేయడానికి ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు కూడా.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024