



Best Web Hosting Provider In India 2024
Hyderabad Traffic : సైబరాబాద్ పోలీసుల వినూత్న ఆలోచన.. ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మీరూ రిజిస్టర్ చేసుకోండి!
Hyderabad Traffic : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అంతాఇంతా కాదు. ట్రాఫిక్ నుంచి తప్పుంచుకొని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లడం సవాలుగా మారుతోంది. మళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి చేరడం కష్టంగా ఉంటోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ట్రాఫిక్ కష్టాలు తగ్గించి వాహనదారుల సమయాన్ని ఆదాచేసేలా సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఓకొత్త ప్లాట్‌ఫాంని అందుబాటులోకి తెచ్చారు. ఆ నూతన విధానం ద్వారా.. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలను ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులు, వాహనదారులకి సమాచారం అందిస్తారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ తెలియడంతో… ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

ట్రాఫిక్ పల్స్ ద్వారా..
ట్రాఫిక్ పల్స్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను సైబరాబాద్ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ జామ్, ప్రమాదం జరిగినా, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు చర్యలు వంటి వివరాలను ట్రాఫిక్ పల్స్ ద్వారా వాహనదారులకు ముందుగానే పంపించనున్నారు. ఇలా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు చేరే అవకాశం ఉంటుందని పోలీసులు వివరిస్తున్నారు.
కష్టాల నుంచి విముక్తి..
భాగ్యనగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించేందుకు.. ట్రాఫిక్ పల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని.. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్లాట్‌ఫాంను తెచ్చినట్టు సీపీ వివరించారు. రియల్ టైం ట్రాఫిక్ అలర్ట్ సర్వీస్‌లో ఫోన్ నంబర్ నమోదు చేసి, ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలని సూచించారు.
చాలా సింపుల్..
ఇలా రిజిస్టర్ అయిన వారికి నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో ట్రాఫిక్ జామ్, ఆంక్షలు, దారి మళ్లింపు, ప్రమాదాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఈ ఆధునిక సౌకర్యాన్ని వాహనదారులు వినియోగించుకొని తమ ప్రయాణాన్ని సులభతరం చేసుకోవాలని సీపీ సూచించారు. ఇది చాలా సింపుల్ ప్రక్రియ అని.. దీనికి వాహనదారుల పేరు కూడా అవసరం లేదని పోలీస్ కమిషనర్ వివరించారు.
వాహనదారులకు అలర్ట్..
‘సైబరాబాద్ పరిధిలో ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే మాకు తెలుస్తుంది. ఆ ఘటనలు ట్రాఫిక్‌పై ప్రభావం చూపితే.. మేము వాహనదారులను అలర్ట్ చేస్తాం. ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు సమాచారం ఇస్తున్నాం. ఇదో కొత్త ప్లాట్‌ఫాం. దీని ద్వారా ఏదైనా సమాచారం వస్తే.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు అనేదే మా ఉద్దేశం’ అని సీపీ అవినాష్ మహంతి వివరించారు.
టాపిక్