




Best Web Hosting Provider In India 2024

Mudragada House Attack : ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి, జనసేనపై ఆరోపణలు
Mudragada House Attack : వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఓ వ్యక్తి ట్రాక్టర్ తో దాడికి దిగాడు. ఇంటి గేటును, కారును ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. తనకు రూ.50 వేలు ఇస్తానంటే దాడి చేసినట్లు ఆ యువకుడు చెప్పాడని ముద్రగడ అనుచరులు చెప్పారు. వైసీపీ నేతలు ముద్రగడను పరామర్శించారు.
Mudragada House Attack : వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నివాసంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి గేట్ ను ట్రాక్టర్ తో ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అనంతరం ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న కారును సైతం ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసున్న పోలీసులు విచారించారు. దాడి వెనుక రాజకీయ కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. తనకు రూ.50 వేలు ఇస్తానంటే దాడి చేసినట్లు యువకుడు చెప్తున్నాడని ముద్రగడ అనుచరులు అంటున్నారు. దాడికి పాల్పడింది జనసేన కార్యకర్త అని ముద్రగడ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ముద్రగడ పద్మనాభం నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది. ముద్రగడ అంటే పవన్ కల్యాణ్ కు, జనసేన నేతలకు గౌరవం ఉందన్నారు. జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ…ఈ దాడికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇలాంటి దాడులను జనసేన ఉపేక్షించదన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేతల పరామర్శ
ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ నేతలు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీత, జక్కంపూడి రాజా, ఇతర నేతలు ముద్రగడతో మాట్లాడారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముద్రగడ కుమారుడు గిరిబాబు గ్రామస్థాయి పర్యటనలు చేపట్టారు. ఈ పర్యటనలకు మంచి స్పందన రావడంతోనే దాడి జరిగి ఉంటుందని ముద్రగడ అనుచరులు ఆరోపిస్తు్న్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ముద్రగడ. అయితే కొన్ని కారణాలతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఇటీవల ఆయనను ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్తగా పార్టీ నియమించింది. త్వరలోనే ప్రత్తిపాడు వైసీపీ ఇన్ ఛార్జ్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దాడి విషయం తెలిసి బాధపడ్డా- ముద్రగడ కుమార్తె
ముద్రగడ పద్మనాభం కుమార్తె జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. దాడి విషయం తెలిసి చాలా బాధపడ్డానన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటువంటి దాడులకు వ్యతిరేకం అన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నేతలు దాడి చేయించారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. దాడి వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతిస్థిమితం లేని వ్యక్తి దాడికి పాల్పడినట్లు అనుమానంగా ఉందని బార్లపూడి క్రాంతి అన్నారు.
టాపిక్