Best Web Hosting Provider In India 2024

Sandeep Reddy Vanga: నా సినిమాను తిట్టి.. హీరోని మాత్రం మెచ్చుకున్నారు.. ఇదీ వాళ్ల తీరు: బాలీవుడ్ పరువు తీసిన సందీప్
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వాళ్ల పరువు తీశాడు. తన యానిమల్ సినిమాను తిట్టి, అందులోని హీరో రణ్బీర్ కపూర్ ను మెచ్చుకోవడంపై తాజాగా అతడు స్పందించిన తీరు వైరల్ అవుతోంది.
Sandeep Reddy Vanga: యానిమల్ మూవీని విమర్శించిన బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లకు మరోసారి గట్టి సమాధానం ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. బ్లాక్బస్టర్ అయిన ఈ సినిమాలో హింస, పురుషాహంకారం మితిమీరిందంటూ చాలా మంది సినీ పెద్దలే విమర్శించారు. దీనిపై తాజాగా యూట్యూబ్ ఛానెల్ గేమ్ ఛేంజర్స్ తో మాట్లాడుతూ సందీప్ మరోసారి స్పందించాడు.
హీరోని తిట్టే ధైర్యం వాళ్లకు లేదు: సందీప్
తన యానిమల్ మూవీని తిట్టి.. అందులో నటించిన రణ్బీర్ కపూర్ ను పొగడటంపై సందీప్ రెడ్డి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ వాళ్లను ఉద్దేశించి అతడు మాట్లాడిన తీరు ఆసక్తికరంగా ఉంది. “ఓ విషయం నేను చెబుతాను. యానిమల్ సినిమాను తిట్టిన సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా రణ్బీర్ మాత్రం ఇరగదీశాడని అన్నారు.
నాకు రణ్బీర్ అంటే ఈర్శ్య లేదు. కానీ ఈ తేడా మాత్రం నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైందేంటంటే వాళ్లు రణ్బీర్ తో పని చేయాలని అనుకుంటున్నారు. అందుకే రణ్బీర్ ను తిడితే ఏమవుతుందో తెలుసు. ఓ స్టార్ ను తిట్టడం పూర్తిగా వేరే విషయం. నాపై కామెంట్స్ చేయడం చాలా ఈజీ.
ఎందుకంటే నేను ఇక్కడ కొత్త. ఓ ఫిల్మ్ మేకర్ రెండు, మూడేళ్లకు ఓ సినిమా తీస్తాడు. కానీ ఓ నటుడు ఏడాదికి ఐదుసార్లు కనిపిస్తారు. అందుకే ఎవరితో పని ఎక్కువగా ఉందో వాళ్లను ఎవరూ ఏమీ అనరు” అని సందీప్ ఘాటుగా స్పందించాడు.
కొత్త వాళ్లు వస్తే ఇలాగే చేస్తారు
బాలీవుడ్ లో బయటి వ్యక్తిగా ఫీలయ్యారా అని అడిగిన ప్రశ్నకు కూడా సందీప్ బదులిచ్చాడు. “లేదు, నేను ఈ లోపలి వ్యక్తి, బయటి వ్యక్తి అనేదాన్ని పెద్దగా పట్టించుకోను. నేనెప్పుడూ బయటివాడిగా ఫీలవలేదు. కానీ కచ్చితంగా స్పష్టమైన అసమానత మాత్రం ఉంది. ఓ కొత్త స్టూడెండ్ స్కూల్ కి వస్తే ఏమవుతుంది. కేజీ నుంచి అక్కడే చదువుతున్న వ్యక్తికి పదో తరగతిలో జాయిన్ అయిన స్టూడెంట్ ను చూస్తే సీనియారిటీ అనేది ఒకటి అనిపిస్తుంది కదా” అని సందీప్ అన్నాడు.
తన కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఓ నటుడికి ఓ పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ నటించే అవకాశం ఇవ్వలేదని, కేవలం ఆ సినిమాలో నటించినందుకే అలా చేశాడని కూడా ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వెల్లడించాడు. ఈ వివక్ష చూపిస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీని.. ఇలాగే రణ్బీర్ విషయంలోనూ చేయాల్సిందిగా సవాలు విసిరాడు. యానిమల్ మూవీని టార్గెట్ చేయడం తనను తీవ్ర అసహనానికి గురి చేసినట్లు చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం