






Best Web Hosting Provider In India 2024

OTT Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ.. ఒకే రోజు రెండు సినిమాలు
OTT Comedy Movie: ఓటీటీలోకి మరో మలయాళం కామెడీ మూవీ వస్తోంది. ఈ ఏడాది జనవరిలో రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు హిట్ కొట్టింది. ఒకే రోజు రెండు వేర్వేరు ప్లాట్‌ఫామ్స్ లోకి రెండు మలయాళం కామెడీ సినిమాలు వస్తున్నాయి.

OTT Comedy Movie: ఓటీటీలోకి మలయాళం సినిమాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో రిలీజైన మూవీస్ ఇప్పుడు మెల్లగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నాయి. అలా ఒరు జాతి జాతకం (ఓ విచిత్రమైన జాతకం) అనే కామెడీ మూవీ కూడా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు వినీత్ శ్రీనివాసన్ నటించిన సినిమా ఇది.
ఒరు జాతి జాతకం ఓటీటీ రిలీజ్ డేట్
ఒరు జాతి జాతకం అనే మూవీ ఈ ఏడాది జనవరి 31న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను మనోరమ మ్యాక్స్ సొంతం చేసుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ సినిమా వస్తుండటం విశేషం. మార్చి 14 నుంచి సినిమాను ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనుంది.
అయితే ఈ ప్లాట్‌ఫామ్ లోని చాలా వరకు మలయాళం సినిమాలు తెలుగులాంటి ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఒరు జాతి జాతకం సినిమా మాత్రం కేవలం మలయాళంలోనే రానుంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడాలనుకుంటే మార్చి 14 నుంచి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
ఒరు జాతి జాతకం స్టోరీ ఏంటంటే?
ఒరు జాతి జాతకం మూవీలో వినీత్ శ్రీనివాసన్ తోపాటు కయదు లోహర్, నిఖిల విమల్, బాబు ఆంటోనీలాంటి వాళ్లు నటించారు. మోహనన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జయేష్ అనే 37 ఏళ్ల వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. చెన్నైలో ఉండే ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు.
అయితే అందుకోసం అతడు పెట్టుకున్న నిబంధనలు జీవితంలో ముందడుగు వేసే ఎలాంటి అమ్మాయినైనా భయంతో వణికిపోయేలా చేస్తాయి. చివరికి అతనికి తగిన ఓ అమ్మాయి దొరికినా.. అదికాస్తా చివరికి అతనికి, అతని కుటుంబానికి పీడకలగా మారుతుంది. అసలు అతని జీవితంలో ఏం జరుగుతుంది? ఆ సవాళ్లను అతడు ఎలా ఎదుర్కొంటాడన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
ఒరు జాతి జాతకం మూవీని రూ.4.55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర రూ.9.23 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని కించపరిచనట్లుగా సీన్లు ఉండటం విమర్శలకు దారితీసింది. అంతేకాదు ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిషేధించారు. ఇప్పుడీ మూవీ మార్చి 14 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.
ఒకే రోజు రెండు కామెడీ సినిమాలు
ఓటీటీలోకి ఒకే రోజు రెండు మలయాళం కామెడీ సినిమాలు వస్తుండటం విశేషం. ఈ ఒరు జాతి జాతకం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న మార్చి 14నే జియోహాట్‌స్టార్ లో పోన్‌మ్యాన్ అనే మరో సినిమా కూడా వస్తోంది.
బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించిన సినిమా అది. ఈ ఏడాది మలయాళం సూపర్ హిట్ సినిమాల్లో అదీ ఒకటి. పెళ్లి కూతురు ఫ్యామిలీకి బంగారం ఇచ్చి తర్వాత పెళ్లిలో అతిథులు ఇచ్చే డబ్బంతా తీసుకెళ్లే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథే ఈ పోన్‌మ్యాన్.
సంబంధిత కథనం