


Best Web Hosting Provider In India 2024

Holi Colours Meaning: హోలీ రంగులన్నీ వేరు వేరు అర్థాలు కలిగి ఉంటాయట! వాటిని తెలుసుకుని ఎవరికి ఏ రంగు వేయాలో తేల్చుకోండి
Holi Colours Meaning: హోలీలో వాడే ప్రతి రంగుకూ ప్రత్యేకమైన అర్థం ఉంటుందని మీకు తెలుసా? పండుగ రోజున మీ ప్రియమైన వారిపై రంగులు చల్లే ముందు వాటి అర్థం తెలుసుకోండి. వాటిని బట్టి ఎవరి మీద ఏ రంగు వేయాలో తేల్చుకోండి.

దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ ఈ ఏడాది మార్చి 14న జరుగుతుంది. భారతదేశంలో జరుపుకునే ప్రతి పండుగకూ ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళిలో దీపాలు, సంక్రాంతికి ముగ్గులు, హోళీలో రంగులు. ఇవి లేకుండా ఈ పండుగలు అసంపూర్ణంగా ఉంటాయి. ప్రస్తుతం దేశ ప్రజలు హోళీ వేడుకలకు సిద్ధమవుతున్నారు. పిండి వంటలు, స్వీట్లతో పాటు ప్రియమైన వారిపై ప్రేమ రంగులు చల్లడానికి వివిధ రకాల రంగులు, స్ప్రేలు కొనుగోలు చేస్తున్నారు. రంగులు కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం మరొకటి ఉంది.
రంగుల పండుగ హెలీలో వాడే ప్రతి రంగుకూ ప్రత్యేకమైన అర్థం ఉంటుందట. వాటిని బట్టే ఎవరి మీద ఏ రంగు వేయాలో నిర్ణయించుకోవాలట. మరి హోలీ రంగుల వెనకున్న నిజమైన అర్థం ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే ఇక్కడ తెలుసుకోండి. రంగుల అర్థాన్ని బట్టి ఎవరి మీద ఏ రంగు వేయాలో తేల్చుకోండి.
హోలీ రంగుల వెనకున్న అర్థాలు
ఎరుపు రంగు:
హిందువుల్లో ఎరుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండుగలు, పూజల్లో ఈ రంగు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఎరుపు రంగును తిలకంగా వేసుకుంటారు, దుస్తులగా కూడా ధరిస్తారు ఎందుకంటే ఎరుపు రంగు ప్రేమ, వివాహం, సంతానోత్పత్తి, శక్తిని సూచిస్తుంది. హోళీ రోజున ఎరుపు రంగు గులాల్‌ను మీ ప్రియురాలు/ప్రియుడు, భాగస్వామి మీద చల్లుకోవాలి.
ఆకుపచ్చ రంగు
వసంతకాలపు మొదటి రంగుగా ఆకుపచ్చ. హోళీ పంట కాలం, వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. అందుకే ఆకుపచ్చ రంగు కొత్త ప్రారంభాలతో అనుసంధానించబడి ఉంటుందిని నమ్ముతారు. హోళీ ఉత్సవాలలో ఇది చాలా ముఖ్యమైన రంగు. రంగు మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఆకుపచ్చ రంగు ప్రశాంతత, ప్రకృతి, కొత్త ప్రారంభాలు, కొత్త అభివృద్ధిని సూచిస్తుంది. హోళీలో ఆకుపచ్చ రంగు చల్లుకోవడం వల్ల జీవితంలో కొత్త ప్రారంభాన్ని ఆకాంక్షిస్తుంది. కనుక మీరు కొత్త బంధాన్ని ఏర్పరుచుకోవాలి అనున్నవారిపై ఆకుపచ్చ రంగును చల్లండి. లేదా మీ స్నేహితుడు\స్నేహితురాలితో మీకు ఏదైనా గొడవ, మనస్పర్థలు వంటివి ఉంటే వాటిని మర్చిపోయి తిరిగి కలిసుందాం అని చెప్పేందుకు వారిపై ఆకుపచ్చ రంగును చల్లండి.
గులాబీ రంగు
గులాబీ రంగుకు మతపరమైన ప్రాముఖ్యత లేనప్పటికీ ఈ రంగు ఆకర్షణ, అందంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా హోళీ పండుగ రోజుల్లో అత్యంత ప్రజాదరణ పొందిన రంగులలో ఒకటి. మృదువైన గులాబీ రంగు అందం, అనురాగం, నమ్మకాన్ని సూచిస్తుంది. పండుగ రోజున ఈ రంగును మీ బంధువులు, అత్యంత స్నేహితులపై చల్లుకోవచ్చు. నమ్మకం, అనురాగం, స్నేహంతో బంధం కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఈ రంగు ద్వారా వారికి తెలియజేయచ్చు.
పసుపు రంగు
రంగులన్నింటిలో పసుపు రంగు అత్యంత సంతోషకరమైన, ప్రకాశవంతమైన రంగుగా పరిగణిస్తారు. దీనిని మరింత ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే ఇది విష్ణుమూర్తి రంగు. పసుపు రంగు ప్రాణశక్తి, ఆనందం, సంతోషం, శాంతి, ఆరోగ్యాం, సూచిస్తుంది. మానసిక వృద్ధిని సూచిస్తుంది. ఈ రంగును మీ గురువు, ఉపాధ్యాయుడు లేదా ఇంట్లోని పెద్దవారికి వేయవచ్చు. స్నేహితులు, మీకు అత్యంత దగ్గరి బంధం కలవారిపై కూడా చల్లవచ్చు.
నీలి రంగు:
నీలం రంగు హిందూమతంలో అత్యంత శుభప్రదమైన రంగులలో ఒకటి. సముద్రం, ఆకాశంలోని అపరిమితమైన విస్తారతను పోలీ ఉంటుంది. అలాగే అత్యంత శక్తివంతమైన దేవుళ్ళు, దేవతల చర్మం కూడా నీలి రంగులోనే ఉంటుంది. వాటి ఆధారంగా నీల రంగు అంతర్ దృష్టి, ఆత్మపరిశీలన, ప్రశాంతత, స్పష్టత, స్థిరత్వాన్ని సూచిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. హోలీ రోజున నీలి రంగు మీ సహోద్యోగులు, స్నేహితుల మీద చల్లుకుని పండుగ జరుపుకోవచ్చు.
నారింజ రంగు:
హోళీ ఉత్సవాలలో తరచుగా ఉపయోగించే నారింజ రంగు, పసుపు తర్వాత మరొక ప్రకాశవంతమైన రంగు. ఇది కాంతి, కొత్త ప్రారంభాలు వంటి వాటితో అనుసంధానంగా పని చేస్తుంది. ఇది సూర్యభగవానుడిని సూచిస్తుందని కూడా హిందువులు నమ్ముతారు. ఈ రంగుకు మరొక అర్థం మళ్ళీ ప్రారంభించడం, క్షమించబడటం. దీన్ని మీరు మోసి చేసిన వారిపై చల్లి వారిని క్షమించండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం