Best Web Hosting Provider In India 2024

బ్యాంకును రూ.27 కోట్లు మోసం చేసిన కేసులో ఎస్బిఐ హైదరాబాద్ ఏజీఎం అరెస్ట్.. నిందితులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో రుణం
తప్పుడు పత్రాలతో రుణం తీసుకుని ఉడాయించిన వారితో కుమ్మక్కైన ఎస్బిఐలో ఏజిఎంగా పనిచేస్తోన్న అధికారిని సీఐడీ అరెస్ట్ చేసింది. గచ్చిబౌలి శాఖలో పనిచేస్తోన్న కొండూరు సంజయ్ నిందితులతో కుమ్మక్కైనట్టు గుర్తించారు.
తప్పుడు పత్రాలతో రుణానికి దరఖాస్తు చేసిన వారితో కుమ్మక్కై బ్యాంకుకు నష్టం వాటిల్లేలా చేసిన ఎస్బిఐ ఉద్యోగి కటకటాల పాలయ్యారు. గచ్చిబౌలిలో ఏజిఎంగా పనిచేస్తోన్న అధికారిని బుధవారం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పనిచేస్తోన్న బ్యాంకుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ఓ అధికారి పోలీసులకు చిక్కాడు. 12 ఏళ్ల క్రితం బ్యాంకును మోసం చేసి రూ.27కోట్ల రుణాన్ని పొందిన వారికి నిందితుడు సహకరించినట్టు గుర్తించారు.
రుణఎగవేతదారులతో కలిసి హైదరాబాద్ ఎస్బిఐలో రూ.27 కోట్లు మోసం చేసిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలి బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండూరు సంజయ్‌ను హైదరాబాద్‌లో సీఐడీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
సంజయ్ 2009-2013 మధ్యకాలంలో బాలానగర్ ఎస్బీఐ ఎంఎస్ఎంఈ శాఖలో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆదర్శ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆ బ్రాంచిలో ఆస్తులు తనఖా పెట్టి రూ. 27 కోట్ల రుణం తీసుకుంది. రుణం మంజూరయిన తర్వాత 2013లో సంస్థ ఎండీ ఎం.ఆంజనేయులు, డైరెక్టర్ రీటాలు పరారయ్యారు.
ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసును సీఐడీకి బదిలీ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే బ్యాంకులో రుణం పేరుతో డ్రామా నడిచినట్టు గుర్తించారు.
చిన్న పరిశ్రమల రుణాల శాఖలో అప్పటి రిలేషన్షిప్ మేనేజర్ సంజయ్‌తో పాటు కస్టమర్ సపోర్ట్ అధికారి జి. రవీంద్రనాథ్ నిందితులతో కుమ్మక్కై మోసానికి పాల్పడినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడయింది.
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆంజనేయులు, రీటాలను సీఐడీ అధికారులు 2024 మే నెలలో బెంగళూరులో అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో నిందితుడు సంజయ్ ని బుధవారం అరెస్టు చేసి ఎల్బీ నగర్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు అతనికి రిమాండు విధించింది. సీఐడీ ఆర్థిక నేరాల విభాగం ఎస్సీ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు సాగింది.