డయాబెటిస్‌కు, అధిక రక్తపోటుకు మధ్య అనుబంధం ఏమిటి? ఈ రెండూ ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటాయా?

Best Web Hosting Provider In India 2024

డయాబెటిస్‌కు, అధిక రక్తపోటుకు మధ్య అనుబంధం ఏమిటి? ఈ రెండూ ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటాయా?

Haritha Chappa HT Telugu

మధుమేహం, అధిక రక్తపోటు… రెండూ కూడా ఆరోగ్యానికి కీడు చేసే అనారోగ్యాలే. అయితే ఈ రెండింటికీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దీనివల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు.

డయాబెటిస్, హైబీపీ…ఈ రెండింటి మధ్య బంధం ఏమిటి. (Pixabay)

డయాబెటిస్, హై బీపీ ఈ రెండూ కూడా ప్రపంచంలో ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. కొంతమందిలో హై బీపీ, డయాబెటిస్ రెండూ జంటగా ప్రయాణం చేస్తున్నాయి.

అయితే కొంతమందిలో డయాబెటిస్ ఉంటే హైబీపీ వస్తుందా? లేక అధిక రక్తపోటు ఉన్నవారికి డయాబెటిస్ వస్తుందా? అనే సందేహం ఉంది. నిజానికి ఈ రెండూ కూడా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు తరచుగా కలిసే వస్తాయి.

డయాబెటిస్, అధికరక్తపోటు… ఈ రెండూ కలిసి వచ్చి గుండె జబ్బుల సమస్యను కూడా పెంచేస్తాయి. డయాబెటిస్ అనేది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. అలాగే అధిక రక్తపోటు అనేది డయాబెటిస్ అదుపులో ఉండకుండా అడ్డుకుంటుంది. అందుకే ఈ రెండూ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

డయాబెటిస్ ఉన్నవారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి తరచుగా ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీనివల్ల వారి కణాలు ఇన్సులిన్ కు స్పందించవు. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగిపోతూ ఉంటుంది. ఇది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కూడా రక్తనాళాలు దెబ్బతింటాయి. అవి ఇరుకుగా మారే అవకాశం ఉంటుంది. దీని వల్ల కూడా అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.

మూత్రపిండాలకు దెబ్బ

డయాబెటిస్ పరోక్షంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరంలో ఉప్పు, నీరు నిలిచిపోయేలా చేస్తుంది. దీనివల్ల రక్తపోటు మరింతగా పెరిగిపోతుంది. ఇక ఊబకాయంతో బాధపడే వారికి మధుమేహం, రక్తపోటు రెండూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అధిక బరువు ఇన్సులిన్ నిరోధకతను రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తుంది. రక్తపోటు పెరుగుదలకు కూడా దారితీస్తుంది.

హైబీపీతో డయాబెటిస్

అధిక రక్తపోటు ఉన్నవారికి మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా నిర్వహించడం కుదరదు. దీనివల్ల చక్కెరస్థాయిలు పెరిగి మధుమేహం వచ్చే అవకాశం పెరిగిపోతుంది. అలాగే జీవన శైలి పరంగా కూడా కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుంది. అధిక రక్తపోటు మధుమేహం ఉన్నవారిలో కంటి వ్యాధుల్ని, మూత్రపిండాల వ్యాధులు వచ్చేలా చేస్తుంది. అంతేకాదు చిన్న చిన్న సమస్యలను కూడా తీవ్రంగా మార్చడంలో హైబీపీ సహకరిస్తుంది.

మధుమేహం అధిక రక్తపోటు రెండు కూడా స్ట్రోక్ కు గుండెపోటుతో సహా అనేక రకాల రోగాల ప్రమాదాన్ని పెంచేస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ రెండింటితో ప్రమాదమే

మధుమేహం, అధిక రక్తపోటు అనేవి ఒకదాన్ని ఒకటి తీవ్రతరం చేసుకుంటాయి. రెండూ కలిసి వచ్చి ప్రాణాంతక సమస్యలను తీసుకొస్తాయి. కాబట్టి ఈ రెండు ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఎప్పటికప్పుడు రక్తపోటును చెక్ చేయించుకోవాలి. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు డయాబెటిస్ వచ్చిందో లేదో ప్రతి మూడు నెలలకు ఒకసారి చెక్ చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/
Source / Credits

Best Web Hosting Provider In India 2024