





Best Web Hosting Provider In India 2024

ఏపీలో దేవాదాయ శాఖకు దేవుడే దిక్కు… ఐఏఎస్‌ల స్థానంలో ఇన్‌ఛార్జిలకు బాధ్యతలు, అధ్యాత్మికత కంటే ఆదాయంపైనే మక్కువ..
ఏపీ దేవాదాయ శాఖను దేవుడే రక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భక్తి విశ్వాసాలను కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో అధ్మాత్మికత కంటే ఆదాయంపైనే అధికారులు దృష్టి సారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సాగాల్సిన పాలనను ఇంఛార్జిలకు అప్పగించడం వెనుక మతలబు ఏమిటో తెలియాల్సి ఉంది.
ఏపీ దేవాలయాల్లో వరుస ప్రమాదాల్లో భక్తులు ప్రాణాలు కోల్పవడానికి దేవాదాయ శాఖకు సరైన సారధి లేకపోవడమేననే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఇంఛార్జిలతో దేవాదాయ శాఖను నడిపించడమే సమస్యకు మూల కారణంగా కనిపిస్తోంది.
దేవుడి దర్శనాలకు వచ్చిన భక్తులు ప్రమాదాల్లో మరణిస్తున్న ఏపీ దేవాదాయ శాఖలో మాత్రం చలనం రావడం లేదు. ప్రమాదాలపై విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం మినహా దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు.
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో భక్తులు చనిపోవడం అందరిని కలిచి వేసింది. రాష్ట్రంలోని ఏ గ్రేడ్ దేవాలయాల్లో ఒకటైన సింహాచలం దేవస్థానానికి ఇప్పటి వరకు పూర్తి స‌్థాయి ఈవో లేరు. సింహాచలం దేవస్థానానికే కాదు ఏపీ దేవాదాయ శాఖకు కూడా పూర్తి స్థాయి కమిషనర్ లేరు.
రాష్ట్రంలో అత్యంత కీలకమైన దేవస్థానాల్లో సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఒకటి. ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న రామచంద్రమోహన్ కూడా గతంలో అక్కడ ఈవోగా పనిచేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, సింహాచలం వంటి ఆలయాలకు దేవాదాయ శాఖలో సీనియర్లుగా ఉన్న అధికారులను ఈవోలుగా నియమిస్తారు.
స్వతంత్ర సంస్థగా ఉన్న టీటీడీకి మాత్రమే ప్రస్తుతం ఐఏఎస్ అధికారి ఈవోగా ఉన్నారు. ఏడు ప్రధాన ఆలయాల్లో ద్వారకాతిరుమల, కనకదుర్గమ్మ ఆలయాలకు తప్ప సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు రెవెన్యూ అధికారులే ఈవోలుగా ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాలను దేవాదాయ శాఖ అధికారులు ఆదాయ వనరులుగా మార్చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.దేవాదాయ శాఖ కమిషనర్‌లుగా ఐఏఎస్ అధికారుల్ని నియమిస్తే అక్రమాలు సాగవనే ఉద్దేశంతోనే వారిని నియమించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యమంత్రి వెళ్లాల్సిన కార్యక్రమం…
సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని తొలుత జీవో విడుదల చేశారు. ప్రధాని పర్యటన, అమరావతి రాజధానిలో కార్యక్రమాల నేపథ్యంలో చివరి నిమిషంలో ముఖ్యమంత్రి సింహాచలం పర్యటన రద్దు అయ్యింది. ఆయన స్థానంలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం సింహాచలం చందనోత్సవానికి హాజరు కాలేదు.
ఇంఛార్జిలతో చక్రం తిప్పాలని…
దేవాదాయ శాఖకు కమిషనర్ నియామకం విషయంలో కొందరు చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ శాఖకు మంత్రిగా ఆనం రాంనారాయణ రెడ్డి ఉన్నా, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రి ఓఎస్డీ దేవాదాయ శాఖలో ఇంచార్జి కమిషనర్ నియామకంలో చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ అధికారులతో సాగాల్సిన పాలనా వ్యవహారాలు ఇంచార్జితో సాగడం వెనుక బడా నేతల స్కెచ్ ఉందనే ఆరోపణలున్నాయి.
దేవాదాయ శాఖ పరిధిలో కోట్లాది రుపాయల ఆస్తులు, భూములు ఉంటాయి. వీటన్నింటి సంరక్షణ బాధ్యతలు కమిషనర్ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూములు వివాదాల్లో ఉన్నాయి. కోర్టు తీర్పులు ఉన్నా అన్యాక్రాంతమైన భూముల్ని స్వాధీనం చేసుకునే విషయంలో దేవాదాయ శాఖ చోద్యం చూస్తోంది.
ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో దేవాదాయ భూముల అన్యాక్రాంతం అవుతున్న ఘటనలపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులను పర్యవేక్షించే అధికారులు వాటిని పరిష్కరించకుండా అడ్డు పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకుని చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇవిగో ఉదాహరణలు..
- దేవాదాయ శాఖలో ఇంచార్జిలకు బాధ్యతలు అప్పగించిన తర్వాత పలు వివాదాస్పద భూముల వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. విజయవాడలో వందల కోట్ల ఖరీదు చేసే దుర్గగుడి ఆలయ భూములను కారుచౌకగా యాభై ఏళ్లకు లీజుకు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అభ్యంతరం చెప్పడంతో ఆ ఫైల్ నిలిచిపోయింది. ఈ భూముల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
- విజయవాడ పటమటలో ఉన్న నల్లూరి వారి సత్రంకు చెందిన ఫంక్షన్ హాల్, వెంకటేశ్వర స్వామి ఆలయాలను స్వాధీనం చేసుకోవాలని ఏపీ హైకోర్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికీ అవి అమలు కాలేదు. ఈ వ్యవహారంలో అర్చకులు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి ఎలాంటి వివాదం లేదని కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ట్రస్టీలతో కుమ్మక్కై దేవాదాయ శాఖ అధికారులు ఈ నివేదిక ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అర్చకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
- విజయవాడ పటమటలో ఉన్న గోవిందరాజులు ఈనాం ట్రస్టుకు చెందిన భూముల్ని లీజు దారుడు జాతీయ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.100కోట్ల రుణం తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దేవాదాయ శాఖకు దానపత్రం రాసిన భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టిన వ్యవహారంపై దేవాదాయ శాఖ అధికారులు నోరు మెదకపడం లేదు. బ్యాంకు అధికారులు కూడా ఫిర్యాదు చేయకు పోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఇంచార్జిలపై మోజు ఎందుకు..
లక్షల ఎకరాల భూములతో కోట్లాది రుపాయలు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నా వాటిని సంరక్షించడం కంటే అయినకాడికి సొమ్ము చేసుకుందామనుకునే ధోరణి దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
దేవాదాయశాఖలో కమిషనర్‌గా ఉన్న ఎస్.సత్యనారాయణను బదిలీ చేసిన తర్వాత ఐఏఎస్ అధికారిని ఆ పోస్టులో నియమించలేదు. అదనపు కమిషనర్-2గా ఉన్న రామచంద్ర మోహన్‌కు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో ప్రధాన దేవాలయమైన కనకదుర్గ ఆలయానికి కూడా ఆయనే ఇన్‌చార్జి ఈవోగా ఉన్నారు.
దేవాదాయ శాఖలో 11 ఆర్జేసీ పోస్టులున్నాయి. డైరెక్టుగా డిప్యూటీ కమిషనర్ల నియామకం చేపట్టి, అసిస్టెంట్ కమిషనర్లకు డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పిస్తే.. తర్వాత రెండేళ్లకు వాళ్లకు ఆర్జేసీగా పదోన్నతులు లభిస్తాయి. ప్రస్తుతం దేవాదాయ శాఖలో భ్రమరాంబ, సత్యనారాయణమూర్తి, త్రినాథ్‌రావు, చంద్రశేఖర్ ఆజాద్ మాత్రమే రెగ్యులర్ ఆర్జేసీలు.
రీజినల్ జాయింట్ కమిషనర్‌లలో భ్రమరాంబ, సత్యనారాయణమూర్తి ఈ ఏడాది, త్రినాథ్‌రావు, ఏడీసీ చంద్రకుమార్ వచ్చే జనవరిలో పదవీవిరమణ చేస్తారు. మిగిలిన ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ పై గతంలో ఏసీబీ దాడులు జరిగాయి.
దుర్ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు
విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున క్యూలైన్ పై గోడ కూలి ఏడుగురు మృతి చెందడానికి గల కారణాలపై విచారణ జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
దుర్ఘటన అనంతరం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.300 దర్శన మార్గం ప్రవేశ ద్వారం నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో బస్టాప్ సమీపంలోని కొండపై గోడ కూలింది.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) ఆకే రవికృష్ణ, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్) ఎం.వెంకటేశ్వర్రావు సభ్యులుగా ఉంటారు.
ఈ ఉత్తర్వులు జారీ చేసిన 72 గంటల్లోగా కమిటీ తన ప్రాథమిక నివేదికను సమర్పించాలని, 30 రోజుల్లోగా పరిశోధనలు, సిఫార్సులతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్